సినిమా రిలీజయ్యాక కలెక్షన్స్ రావడం అనేది ఎంత కామనో.. సాయంత్రమో లేక మరుసటి రోజుకో పైరసీ ప్రింట్ రావడం అనేది కూడా అంతే సహజం. టికెట్ ధరలు పెరగడం, కుటుంబ సభ్యులందరూ కలిసి సినిమా చూద్దామని థియేటర్లకి, ముఖ్యంగా మల్టీ ప్లెక్స్ లకి వెళ్లడానికి కూడా భయపడుతున్న తరుణమిది. అందుకే ఆన్ లైన్ పైరసీ అనేది పేట్రేగిపోతోంది. ఈ పైరసీ మాఫియాకి దొంగ సీడీలు, ఆన్ లైన్ డౌన్ లోడ్స్ ద్వారా సరిగా డబ్బులు రావట్లేదో లేక అవి సరిపోవట్లేదో తెలియదు కానీ.. ఏకంగా ఒక మాఫియాలా ఫామ్ అయ్యి డైరెక్ట్ గా ప్రొడ్యూసర్స్ ని భయపెట్టడం మొదలెట్టారు. నిన్నమొన్నటివరకూ మీడియం బడ్జెట్ సినిమాల నిర్మాతలనే టార్గెట్ చేసిన ఈ పైరసీదారులు ఇప్పుడు ఏకంగా బడా నిర్మాతలనే టార్గెట్ చేయడం మొదలెట్టారు.
డైరెక్ట్ గా బడా నిర్మాతలకి కాల్ చేసి “5 లక్షలు ఇస్తారా లేక సాయంత్రం కల్లా పైరసీ ప్రింట్ ఆన్ లైన్ లో పెట్టేయాలా” అని బెదిరింపులు మొదలెట్టారు. కొందరు భయపడి డబ్బులిస్తే ఇంకొందరు భయపడక నష్టపోయారు. ఆ విధంగా సాగుతున్న ఈ మాఫియా సెగ డైరెక్ట్ గా దిల్ రాజు గ్యాంగ్ కి తాకిందని వినికిడి. దాంతో రంగంలోకి దిగిన రాజు పోలీసులని ఇన్వాల్వ్ చేసి ఆ మాఫియాకి చెందిన కొందరిని అరెస్ట్ చేయించాడు. మరి పైరసీదారులు ఉరుకుంటారా.. ఇమ్మీడియట్ గా “మిడిల్ క్లాస్ అబ్బాయి” పైరసీ ప్రింట్ ను సాయంత్రం కల్లా ఆన్ లైన్ లో పెట్టేశారు. దాంతో దిల్ రాజు ఇంకాస్త సీరియస్ అయ్యాడని అసలు పైరసీ వ్యవస్థ అనేది లేకుండా చేసేందుకు పూనుకున్నాడని సమాచారం. మరి దిల్ రాజు ఆరంభ శూరత్వం ఫలించి తెలుగు సినిమాకి పైరసీ భూతం వీడుతుందని ఆశిద్దాం.