టాలీవుడ్ లో ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా నిర్మిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రతి సినిమాకి సంబంధించి దిల్ రాజుకి ఒక లెక్క ఉంటుంది. పక్కా ప్లానింగ్ తో ఉంటారు. అయితే ఒక సినిమా విషయంలో మాత్రం ఆయన ప్లానింగ్ దెబ్బకొట్టింది. అదే ‘వారసుడు’. రూ.110 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో సినిమా చేశారు దిల్ రాజు.
తమిళ వెర్షన్ ఇప్పటికే రిలీజయింది. అక్కడ మంచి స్పందనే వస్తుంది. అయితే తెలుగు వారికి మాత్రం ఈ సినిమా ఒక రొటీన్ కాన్సెప్ట్. ఇలాంటి కథలతో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. మొదటి నుంచి ఈ సినిమాపై జనాలకు పెద్దగా ఆసక్తి లేదు. ఇక ట్రైలర్ రిలీజైన తరువాత టాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాను లైట్ తీసుకున్నారు. ఎందుకో ఈ సినిమా విషయంలో దిల్ రాజు ప్లాన్స్ ఏవీ వర్కవుట్ కావడం లేదు.
కోలీవుడ్ నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ కి ఎవరూ రాలేదు. హీరో విజయ్ ని కనీసం ఒక ప్రెస్ మీట్ కి కూడా తీసుకురాలేకపోయారు దిల్ రాజు. రీసెంట్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లను పెట్టుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టారు దిల్ రాజు. ఆ వేదికపై శరత్ కుమార్ ని పట్టుకొని.. మీరు ప్రమోషన్స్ కి డేట్స్ ఇస్తారా..? అని అడిగారు దిల్ రాజు. ఇప్పటివరకు తన కెరీర్ లో దిల్ రాజు ఒక ఆర్టిస్ట్ ని ఇలా అడిగిన సందర్భమే లేదు. డబ్బింగ్ సినిమా రిలీజ్ చేసినప్పుడు కూడా ఆయన బ్యానర్ అంటే ఒక బజ్ ఉంటుంది.
కానీ ‘వారసుడు’ సినిమా విషయంలో అలా జరగలేదు. హీరో, హీరోయిన్స్ ని పిలిచి ఒక ప్రీరిలీజ్ ఈవెంట్ ని కూడా ప్లాన్ చేసుకోలేకపోయారు. విజయ్ గురించి తమిళ మీడియాలో చాలా గొప్పగా మాట్లాడారు దిల్ రాజు. విజయ్ స్వయంగా తనకు కాఫీ కలిపి ఇచ్చారని.. ఇప్పటివరకు తనతో కలిసి వర్క్ చేసిన ఏ హీరో అలా చేయలేదని విజయ్ ని ఆకాశానికి ఎత్తేశారు. అయినప్పటికీ విజయ్ మనసు కరగలేదు. ఎలాంటి బజ్ లేకుండా ‘వారసుడు’ సినిమాకి సరైన ఓపెనింగ్స్ అయినా.. వస్తాయో లేదో చూడాలి!