ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ (Krishna Vamsi) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన సినిమాలు ఉన్నా, లేకపోయినా.. రిలీజ్ ఉన్నా, లేకపోయినా ఆయన ఏదో విషయం మీద రిప్లైలు ఇస్తూనే ఉంటారు. అలాంటిది ఆయన సినిమా రిలీజ్ ఉన్నప్పుడు ఇంకాస్త యాక్టివ్‌గా ఉంటారు. మహేశ్ బాబు (Mahesh Babu) కెరీర్‌లో క్లాసిక్ మూవీగా నిలిచిన ‘మురారి’ని (Murari) ఇప్పుడు రీరిలీజ్ చేస్తున్నారు. ఆగస్టు 9న మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా వస్తోంది. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఆయన ఇతర సినిమాల గురించి కూడా కొంతమంది నెటిజన్లు స్పందిస్తున్నారు.
వాటికి ఎంతో ఓపికగా సమాధానాలిచ్చారు. ఈ క్రమంలో ‘అంతఃపురం’ సినిమా గురించి ఒకరు ప్రశ్న వేశారు. ఆ సినిమాలోని ‘అసలేం గుర్తుకు రాదు..’ పాట గురించి మాట్లాడారు. ఆ పాటలో సౌందర్య (Soundarya) చీర రంగులు మారడం భలే ఆలోచన అని అన్నారు. దానికి కృష్ణ వంశీ ‘అది సినిమాలో లేదండీ. జెమినీ టీవీలో టెలీకాస్ట్ అయినప్పుడు ఆ ఎడిటర్ అలా మార్చారు’ అని చెప్పారు. దీంతో నెటిజన్లు షాక్ అయ్యారు.
అలాగే ‘మురారి’ ఫ్లాప్ మూవీ’ అని మరో నెటిజన్ అనడంతో కృష్ణవంశీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘‘మురారి’ సినిమా ఐదేళ్ల పాటు తూర్పుగోదావరి జిల్లా హక్కులను నిర్మాత ఎన్.రామలింగేశ్వరరావుగారి నుండి రూ.55 లక్షలకు కొన్నాను. ఫస్ట్ రన్‌లోనే రూ. కోటి 30 లక్షలు వసూళ్లు వచ్చాయి అని నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు.
ఒకవేళ సినిమా విజయం గురించి తేల్చడానికే వసూళ్లే ప్రాతిపదిక అయితే ఈ వసూళ్ల వివరాలు చూసి మీరే నిర్ణయించుకోండి అని రిప్లై ఇచ్చారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు నెగెటివ్ కామెంట్లు చేసినా, మనం సంయమనం పాటించాలి అని మరో నెటిజన్‌కు సమాధానం ఇచ్చారు. పొరపాటున మనం బ్యాలెన్స్ కోల్పోతే వాళ్లు విజయం సాధించినట్లు ఫీలవుతారు అని కూడా అన్నారు.