నాలుగేళ్ళ క్రితం ‘మాయావన్’ అనే తమిళ చిత్రం తెరకెక్కింది. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు. అప్పటివరకు మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న సి.వి.కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చెయ్యడం విశేషం. ‘పిజ్జా’, ‘సూదు కవ్వుం’, ‘ఇరుదు సుట్రు’ వంటి ఎన్నో విభిన్న తరహా సినిమాలను ఇతను నిర్మించాడు. అవన్నీ సూపర్ హిట్ అయ్యాయి కూడా..! ఎంతో ఇష్టపడి మనసు పెట్టి చేసిన ‘మాయావన్’ చిత్రానికి మంచి టాకే వచ్చింది.
టేకింగ్ చాలా కొత్తగా ఆకట్టుకునే విధంగానే ఉంటుంది. కానీ ఈ సినిమాకి ఎక్కువ బడ్జెట్ పెట్టేసాడు. దాంతో సినిమా కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలింది. ఈ సినిమాకి భారీ నష్టాలు వచ్చాయని.. స్వయంగా సి.వి.కుమారే చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ‘మాయావన్’ దెబ్బకి రెండేళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. తరువాత మరో 3 చిన్న సినిమాలను నిర్మించి కొంతవరకూ కోలుకున్నాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ‘మాయావన్’ కు సీక్వెల్ చేయబోతున్నట్టు ప్రకటించి అందరికీ షాకిచ్చాడు.
ఈరోజు సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా ‘మాయావన్ రీలోడెడ్’ అంటూ ఓ పోస్టర్ ను విడుదల చేసాడు. ఈ ప్రాజెక్టుకి కూడా అతనే నిర్మాత,దర్శకుడు. తనకు నష్టాలను మిగిల్చి.. రెండేళ్ళ పాటు సినిమాలకు దూరం అయ్యేలా చేసిన ప్రాజెక్టుకి సీక్వెల్ చేస్తుండడం.. అతను ఎంత కసితో ఉన్నాడు అన్న విషయాన్ని తెలియజేస్తుంది. ఇక ‘మాయావన్’ చిత్రాన్ని తెలుగులో కూడా ‘ప్రాజెక్ట్ -Z’ పేరుతో డబ్ చేసిన సంగతి తెలిసిందే. ఓటిటిలో ఈ చిత్రానికి మంచి స్పందనే లభించింది.