‘ఓ కొడుకుగా నా తల్లి గౌరవాన్ని కాపాడుకోలేకపోతే బతకడం కంటే చావడం మంచిది’ అంటూ నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. అదే విషయంపై ఈరోజు పవన్ కల్యాణ్ ఫిలిం ఛాంబర్ వద్ద నిరసన తెలిపారు. పవన్‌తో పాటు ఆయన తల్లి, ఆయన సోదరుడు నాగబాబు, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్ శుక్రవారం ఫిలిం ఛాంబర్ వద్దకు చేరుకున్నారు. తన తల్లిని దూషించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ‘మా’ అసోసియేషన్, నిర్మాతల మండలిని పవన్ ప్రశ్నించారు. శ్రీరెడ్డి వ్యాఖ్యల వెనుక తానున్నానని రామ్‌గోపాల్ వర్మ ప్రకటించడంతో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చించారు. తనకు న్యాయం జరిగే వరకు ఫిలిం ఛాంబర్ వదిలి వెళ్లేది లేదని పవన్ స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులు పవన్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా పూరి జగన్ స్పందించారు. “నాకు జీవితాన్నిచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బాధపడడటం నాకు చాలా బాధ కలిగించింది. అతనిని ఎప్పుడూ ఇలా చూడలేదు. రామ్ గోపాల్ వర్మ చేసిన పని నాకు నచ్చలేదు. ప్రాణం ఉన్నంతవరకు పవన్ కళ్యాణ్ కి నా మద్దతు ఉంటుంది” అని ట్వీట్ చేశారు. యువ హీరో నితిన్ కూడా ఛాంబర్ వద్దను తాను రాలేకపోయినప్పటికీ పవన్ కి మద్దతు తెలుపుతున్నానని చెప్పారు.