సాధారణంగా ఒక సినిమా హిట్ అయ్యిందంటే.. సదరు సినిమా హీరోహీరోయిన్లు, దర్శకుడు చుట్టూ పదుల సంఖ్యలో నిర్మాతలు పానకం చుట్టూ ఈగల్లా వాలిపోతుంటారు. సదరు హీరోహీరోయిన్లు, దర్శకుడు కూడా దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా హిట్, ఫ్లాప్ అనేవి బేరీజు వేసుకోకుండా ఒక అయిదారు సినిమాలకు అడ్వాన్స్ లు తీసేసుకోని వరుసబెట్టి సినిమాలు తీసేస్తుంటారు. కానీ.. సందీప్ రెడ్డి వంగా విషయంలో మాత్రం ఇండస్ట్రీ లెక్కలు ఫెయిల్ అయ్యాయి. “అర్జున్ రెడ్డి” బ్లాక్ బస్టర్ అనంతరం మనోడికి వచ్చినన్ని ఆఫర్లు ఫుల్ ఫామ్ లో ఉన్న వినాయక్, శ్రీనువైట్లకి కూడా రాలేదేమో. కానీ.. కాన్ఫిడెన్సో, ఓవర్ కాన్ఫిడెన్సో తెలియదు కానీ.. సందీప్ ఎవరి దగ్గరా అడ్వాన్స్ తీసుకోలేదు. సెకండ్ సినిమా కూడా తన బ్యానర్ లోనే ఉండేలా ప్లాన్ చేసుకొన్నాడు.
మహేష్ బాబుకి ఒక కథ చెప్పి ఓకే చేయించుకొన్నాడు. మహేష్ సినిమా కంటే ముందు “షుగర్ ఫ్యాక్టరీ” అనే క్రైమ్ డ్రామా ఒక తీద్దామనుకొన్నాడు. కానీ.. మహేష్ కథకి ప్రీప్రొడక్షన్ వర్క్ ఎక్కువగా ఉండడంతో తాను ప్లాన్ చేసుకొన్న చిన్న సినిమాను పక్కన పెట్టేశాడు. అయితే.. ఇప్పుడు మహేష్ బాబు తన 25వ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, 26వ సినిమా సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు పచ్చ జెండా ఊపడంతో.. సందీప్ రెడ్డి సినిమా ఉందని మహేష్ స్వయంగా కన్ఫర్మ్ చేసినప్పటికీ.. ఇంకో మూడేళ్లపాటు ఆగాలంటే అప్పటికి “అర్జున్ రెడ్డి” అనే సినిమా తీసిన సందీప్ రెడ్డి అనే దర్శకుడి పేరు ఎంతమందికి గుర్తుంటుంది చెప్పండి. మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సందీప్ ఇమ్మీడియట్ తాను “అర్జున్ రెడ్డి” కంటే ముందు రాసుకొన్న “షుగర్ ఫ్యాక్టరీ”ని స్టార్ట్ చేస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం.