సమాజంలోని సున్నితమైన అంశాలను సినిమాలుగా తీయడంలోనే కాదు, బయట కూడా ఆ విషయాల మీద అంతే బలంగా మాట్లాడే దర్శకుల్లో శేఖర్ కమ్ముల (Sekhar Kammula) ఒకరు. సగటు లవ్ స్టోరీ, మాస్ కథలు ఎంచుకోవడం ఆయనకు నచ్చదు. ఒకవేళ అలాంటివి చేసినా అందులో ఓ సందేశమో, ఎవరూ చర్చించని సమస్యనో స్ఫృశిస్తారు. ఇప్పుడు ఆయన నాగార్జున (Nagarjuna) – ధనుష్ (Dhanush) ‘కుబేర’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఆయన బ్లాక్‌బస్టర్ సినిమా ‘హ్యాపీడేస్’ (Happy Days) రీరిలీజ్ సందర్భంగా మాట్లాడారు. ఈ క్రమంలో సినిమా పరిశ్రమ మీద, రాజకీయాల మీద కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
‘లీడర్’ (Leader) సినిమా చేసేటప్పటికే రాజకీయాలు ఓ స్థాయిలో దిగజారిపోయాయని, ఇక అంతకంటే పడిపోవడానికి ఏం లేదు అనుకున్నానని, కానీ ఇప్పుడు పరిస్థితులు ఇంకా దిగజారిపోయాయి అని కామెంట్ చేశారు శేఖర్ కమ్ముల. ‘లీడర్’ సినిమా కథ రాసేటప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి అని రాస్తే అందరూ ఆశ్చర్యపోయారని, ఇప్పుడది చాలా చిన్న విషయం అయిపోయిందని ప్రస్తుతం రాజకీయాల గురించి మాట్లాడారు. దీంతో ఆయన ఎవరి గురించి ఈ మాటలు అన్నారనే చర్చ మొదలైంది.
తన సినీ ప్రయాణం గర్వంగానే ఉందని చెప్పిన ఆయన ఈ సినిమా ప్రపంచం క్రూరమైనది అని అన్నారు. నిత్యం ఈ పరిశ్రమలో కఠినమైన సవాళ్లు ఉంటాయని, ఇక్కడ సక్సెస్ ఇస్తేనే పైన ఉంటామని, లేదంటే పాతాళంలో పడిపోతామని గ్రౌండ్ రియాలిటీ చెప్పారు. ఆర్థికంగా తాను అంత బలవంతుణ్ని కాకపోయినా ఇలాంటివన్నీ ఎదుర్కొని.. రాజీ పడకుండా విలువలు, సిద్ధాంతాలతో సినిమాలు తీసి మెప్పించానని తెలిపారు. అందుకే ఇక్కడ స్థిరంగా నిలబడ్డానని, దానికి గర్వంగా అనిపిస్తుంది అని చెప్పారు.
వ్యక్తిగతంగా మనుసలో పుట్టిన ఆలోచనలతో కథను రాస్తానని, అందుకే దీనికి ఎక్కువ సమయం పడుతుంది అని తన నిదానం గురించి వస్తున్న విమర్శలకు జవాబు ఇచ్చారు. ఒకవేళ చకచకా తీయాలని ప్రయత్నిస్తే అనుకున్నది అనుకున్నట్లు చెప్పలేకపోవచ్చేమో అని కూడా చెప్పారు.