నవల ఆధారంగా సినిమాలు తెరకెక్కించడం కొత్తేమీ కాదు. అయితే ఇటీవల కాలంలో ఇలాంటి సినిమాలు తగ్గుతున్నాయి. అయితే ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan: I) సినిమాలతో మణిరత్నం (Mani Ratnam) కోలీవుడ్‌లో ఈ ట్రెండ్‌ను మరోసారి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆయన దారిలో శంకర్ (Shankar) కూడా నడవాలని అనుకుంటున్నారా? అవుననే అంటున్నాయి కోడంబాక్కం వర్గాలు. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) తర్వాత శంకర్ స్టార్ట్ చేయబోయే సినిమా అదే అని చెబుతున్నారు కూడా. ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఎప్పుడు వస్తుంది అనే విషయంలో చాలా ఊహాగానాలు ఉన్నాయి.
క్రిస్‌మస్ అని చెబుతున్నారు కానీ.. ఎప్పుడు అనేది క్లియర్ ఇంకా అవ్వలేదు. రెండో సింగిల్ లాంచ్ చేసినప్పుడు అయినా చెబుతారేమో చూడాలి. ఆ విషయం పక్కనపెడితే.. దాని తర్వాత శంకర్ చేయబోయే సినిమా ‘భారతీయుడు 3’ అని చెప్పాలి. నిజానికి ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. పోస్ట్‌ప్రొడక్షన్ చేసి విడుదల చేయాలి. దీంతో నెక్స్ట్ శంకర్ మెగా ఫోన్ పట్టుకోబోయేది పాన్ ఇండియా సినిమా కోసమే అంటున్నారు.
ఆ సినిమా మామూలది కాదు అని కూడా చెబుతున్నారు. ఒక ప్రముఖ నవలను తీసుకొని, ఇద్దరు స్టార్ హీరోలను ఎంచకుని.. మూడు భాగాలుగా తెరకెక్కించి బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టాలని చూస్తున్నారు. అన్నట్లు ఈ సినిమాకు రూ. 1000 కోట్లు బడ్జెట్ పెడతారు అని చెబుతున్నారు. త్వరలోనే ఈ అనౌన్స్‌మెంట్ అవ్వొచ్చు అని చెబుతున్నారు. సూర్య (Suriya) , విక్రమ్ (Vikram) ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుందని, తమిళనాట ప్రాచుర్యం పొందిన ‘వేల్పారి’ అనే నవల ఈ కథకు ఆధారమని సమాచారం.
మూడు భాగాలను ఒకేసారి చిత్రీకరించి.. రెండు, మూడు నెలల గ్యాప్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమాకు నిర్మాత ఎవరు అనేది తెలియడం లేదు. వరుస పరాజయాల్లో శంకర్‌ను ఇప్పుడు నమ్మి ఎవరు అంత డబ్బు పెడతారు అనేది తెలియడం లేదు. అయితే ‘గేమ్ ఛేంజర్’ సినిమా విజయం సాధిస్తే.. కచ్చితంగా పెద్ద నిర్మాతలు ముందుకొస్తారు అని చెప్పొచ్చు.