సురేష్ కృష్ణ దర్శకత్వంలో జగపతి బాబు, సుహాసిని ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న డివైన్ ఫిల్మ్ ‘అనంత’ ఆడియో, టీజర్ లాంచ్ గురువారం (Nov 13) హైదరాబాద్‌లో జరిగింది. టాలీవుడ్ నిర్మాతలు పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ, రామ్ మోహన్ రావు, సీనియర్ సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని టీంకు శుభాకాంక్షలు తెలిపారు.
పుట్టపర్తి సత్యసాయి బాబా జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంపై డైరెక్టర్ సురేష్ కృష్ణ మాట్లాడుతూ, “బాబా గారి శత జయంతి సందర్భంగా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఇది సాధారణ భక్తి చిత్రం మాత్రమే కాదు చాలా విభిన్నమైన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందించాం. బాబా గారి ప్రేమ తత్వం మరింత మందికి చేరేలా ‘అనంత’ ఉండబోతుంది” అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు వీర శంకర్, రచయితలు సాయి మాధవ్ బుర్రా, రాకేందు మౌళి, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో వందలాది చిత్రాలకు పనిచేసిన సురేష్ కృష్ణ , రజినీకాంత్ తో ‘బాషా’, ‘బాబా’, చిరంజీవితో ‘డాడీ’, వెంకటేష్ తో ‘ప్రేమ’, ప్రభాస్ తో ‘రాఘవేంద్ర’ లాంటి హిట్ చిత్రాలతో స్టార్ డైరెక్టరుగా పేరుపొందారు. చాలా గ్యాప్ తర్వాత ఆయన డైరెక్ట్ చేస్తుండటంతో ‘అనంత’ పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.