శివ.. తెలుగు చిత్ర పరిశ్రమను కొత్త బాటలో నడిపించడానికి స్ఫూర్తిగా నిలిచిన సినిమా. టైటిల్ లోగో నుంచి కథ, హీరోయిజం, ఫైట్స్, బ్యాగ్రౌండ్ సంగీతం అన్నింటిలోనూ వైవిద్యాన్ని చూపించారు రామ్ గోపాల్ వర్మ. ఈ బ్లాక్ బస్టర్ మూవీ డైరక్టర్ తో పాటు హీరో నాగార్జున కెరీర్ కి ఉత్సాహాన్నిచింది. అటువంటి సినిమా నిర్మాణంలో అనేక శాఖల్లో తేజ పనిచేశారు. ఆనాటి మేకింగ్ సంగతులను లేటెస్ట్ గా వెల్లడించారు. “శివ సినిమాకు పబ్లిసిటీ ఇన్ఛార్జ్ గా పనిచేసాను. అప్పటి వరకు తెలుగు సినిమాల పోస్టర్లలో టైటిల్ కు పసుపు రంగే వేసేవాళ్లు. కానీ నేను తొలిసారిగా టైటిల్ కు ఎరుపు వాడాను.” అని వివరించారు.
ఇంకా మాట్లాడుతూ “శివ టైటిల్ లోగోలో కనిపించే నాగ్ ఫొటో ‘శివ’ కోసం తీసింది కాదు. “విక్కీదాదా” కోసం చేసిన ఫొటో షూట్ నుంచి ఈ ఫొటో తీసి “శివ” లోగో డిజైన్ చేశాము. ఇక టైటిల్ మీద నాగ్ సైకిల్ చైన్ పట్టుకున్నట్లుగా ఉంటుంది. కానీ అక్కడ కనిపించే చెయ్యి నాగార్జునది కాదు. నాగార్జున అన్నయ్య అక్కినేని వెంకట్ చెయ్యి అది” అని తేజ శివ మేకింగ్ రహస్యాలు బయటపెట్టారు. మరి శివ సినిమాకు పనిచేసినందుకు ఎంత తీసుకున్నారు ? అని అడిగితే .. “నెలకు 1500 చొప్పున జీతం తీసుకున్నాను” అని తేజ గుర్తు చేసుకున్నారు.