తేజ సినిమాల కంటే ఆయన చేసే కామెంట్సే ఎక్కువగా వార్తలాకెక్కుతాయి. దర్శకుడిగా ఆరంభంలో వరుస విజయాలు చూసిన ఈయనకు ఇప్పుడు వాటి పలకరింపు కూడా కరువైంది. తన ప్రాభవాన్ని పునరుద్ధరించుకోవాలని కొంతకాలంగా ప్రయత్నిస్తున్న తేజ “అహం” అనే భిన్నమైన సినిమా ప్రకటించాడు.
నటీనటుల సమస్యతో అది కుదరకపోయినా తన తాజా సినిమాకి మరోసారి అలాంటి టైటిల్ నే ఖరారు చేశాడు. అగ్రెసివ్ దర్శకుడిగా పేరున్న తేజ ‘నిజం’ తర్వాత స్టార్ల జోలోకి పోనేలేదు. కొత్తవారిని తెరకు పరిచయం చేస్తూ కార్యం పూర్తి చేసేస్తున్నాడు. అలాంటిది తన సినిమాతోనే పరిచయమైనా ప్రస్తుతం కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటూ స్టార్ హీరోయిన్ గా చెలామణీ అవుతోన్న కాజల్, బాహుబలి తో హీరోకు మించి పాపులారిటీ తెచ్చుకున్న రానాలతో సినిమా ప్రకటించి అందరినీ అబ్బురపరిచాడు.
ఓ పట్టణంలో సాగే పొలిటికల్ డ్రామాతో ఈ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకి టైటిల్ గా “నేనే రాజు.. నేనే మంత్రి” అన్న టైటిల్ ను తేజ తన సొంత బ్యానర్ పై రిజిస్టర్ చేయించారట. చూస్తుంటే ఈ టైటిల్ లోనూ ‘అహం’ ఛాయలు కనపడుతున్నాయి. అసలు కథనం ఏమిటో మరి..?