మాటల్లో చెప్పలేని విషయాలను డెలివర్ చేయడానికి కన్నీళ్లు ఓ మార్గమని చెబుతుంటారు. కన్నీళ్లు అని డైరెక్ట్‌గా అనలేం కానీ.. ఎమోషనల్ అనే అందమైన పదం వాడొచ్చు. దీనిని మనం తరచుగా యూట్యూబ్ థంబ్‌నెయిల్స్‌లో చూస్తుంటాం. దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు.. ఇలా చాలామంది సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లలో (ఒకప్పుడు ఆడియో రిలీజ్ ఫంక్షన్లలో) ఎమోషనల్ అయి, కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితిని మనం చాలా ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం కూడా.
తాజాగా ‘ది రాజా సాబ్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో ఈ పరిస్థితిని మళ్లీ చూశాం. తనకు అవకాశం ఇవ్వడం, తనను నమ్మడం లాంటి పరిస్థితుల గురించి గుర్తు చేసుకుంటూ ఆ సినిమా దర్శకుడు మారుతి ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఆయనను ప్రభాస్ కన్సోల్ చేయడం కూడా చూసే ఉంటారు. ప్రభాస్ ఫ్యాన్స్, మారుతి ఫ్యాన్స్ ఆ వీడియోను చూసి చలించిపోతున్నారు. తమ హీరో గోల్డ్ అని.. అందుకే మారుతి అలా ఫీలయ్యారని డార్లింగ్ ఫ్యాన్స్.. మారుతి ఎంత ప్యూరో చూశారా అని ఆయన ఫ్యాన్స్ చలించిపోతున్నారు.
అయితే, ఇక్కడే ఓ పాత పాయింట్ చర్చలోకి వచ్చింది. అదే ప్రీరిలీజ్ ఈవెంట్ స్టేజీ మీద ఎమోషనల్ అవ్వడం. ప్రీరిలీజ్ ఈవెంట్ / ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో దర్శకుడు కన్నీళ్లు పెట్టుకున్న సినిమాలేవీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. సినిమా విజయం సాధించాక చేసుకునే సంబరాల్లో ఎమోషనల్ అయితే ఒకే. దీనికి ఉదాహరణలు చెప్పాలంటే చాలా సినిమాల పేర్లు, ఆ సినిమా దర్శకుల పేర్లు చెప్పాలి. అప్పుడు లేనిపోని ‘రభస’ అవుతుంది. ఎక్కువగా కొత్త దర్శకులు.. పెద్ద హీరోలతో చేసిన సినిమాల విషయంలోనే ఇది జరిగింది.
అయితే, ఇక్కడ మారుతి కొత్త దర్శకుడు కాదు.. కాబట్టి ఈ సెంటిమెంట్ దీనికి పట్టకపోవచ్చు. కానీ ఆ భయమైతే ఫ్యాన్స్‌లో ఉండిపోతుంది. కాబట్టి పెద్ద సినిమా చేయడం మాత్రమే కాదు.. పెద్దగా కంట్రోల్ కూడా చేసుకోవాలి బాస్.