ప్రత్యేక గీతాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న నటి డిస్కోశాంతి. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆమె చేసిన పాటలు అన్నీ సూపర్ హిట్. నటుడు శ్రీహరిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికే పరిమితమైన ఈమె.. అతను మరణించిన తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఇప్పుడిప్పుడే మామూలు మనిషి అవుతున్నారు. ఈ సందర్భంగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో కాస్టింగ్ కౌచ్ పై తన అభిప్రాయాన్నీ నిర్మొహమాటంగా చెప్పారు. తనకి అటువంటి ఒత్తిడి ఎప్పుడూ ఎదురుకాలేదని వివరించారు. తనను చూస్తేనే అందరూ భయపడతారని తెలిపారు. ఎవరైనా తనతో అలా ప్రవర్తిస్తే చంపేస్తానని హెచ్చరించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. “కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినీ రంగంలోనే కాదు. ప్రతి చోటా ఉంటాయి.
అయితే వాటికి ప్రత్యక్ష సాక్షులు ఎవరూ ఉండరు” అని చెప్పారు. “ఏ రంగంలోనైనా మహిళలకు ఇష్టం లేకుండా ఎవరూ లైంగిక దాడి చేయరు. అలా చేస్తే జైలుకు వెళ్తామనే భయం అందర్లో ఉంటుంది” అని స్పష్టం చేశారు. శ్రీ రెడ్డి చేసిన ఆరోపణలపై పరోక్షంగా స్పందిస్తూ.. “అవకాశాల కోసం కొందరు వారంతట వారే వెళ్తున్నారు.. ఆ తర్వాత మీడియాలో పబ్లిసిటీ కోసం ఆ విషయాలను చెప్పుకుంటున్నారు. మగవాడు పిలిచిననప్పుడే చెంప పగులకొడితే… అసలు ఇబ్బందే లేదు కదా?” అని వెల్లడించారు. ఆమె మాటలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి.