కొంతకాలంగా సరైన హిట్టు లేక ఢీలాపడిన కృతిసనన్ (Kriti Sanon) నటిగా తన సత్తాను నిరూపించుకునేందుకు నిర్మాతగా మారి నటించిన తాజా చిత్రం “దో పత్తి” (Do Patti) . నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ మంచి ఆసక్తి నెలకొల్పింది. కృతిసనన్ మొదటిసారి ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాకు కనికా థిల్లాన్ కథ అందించి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించడం గమనార్హం. మరి ఈ రెండు పేకల ఆటలో నటిగా, నిర్మాతగా కృతిసనన్ ఏమేరకు విజయం సాధించిందో చూద్దాం..!!
కథ: సౌమ్య (కృతిసనన్) ఓ సాధారణ ఆడపిల్ల. మనసుకి నచ్చిన ధృవ్ (షకీర్ షేక్)ను పెళ్ళాడి సంతోషమైన జీవితం గడపాలి అనుకుంటుంది. అదే సమయంలో సడన్ ఎంట్రీ ఇస్తుంది సౌమ్య కవల చెల్లెలు షాలీ (రెండో కృతి సనన్). అప్పటివరకు సౌమ్య అమాయకత్వాన్ని ఇష్టపడిన ధృవ్, సడన్ గా షాలీ చిలిపితనం మీద మోజుపడతాడు.
ఆ తర్వాత కథ ఎటు వెళ్ళింది? సౌమ్య-షాలీ నడుమ పోటీ వాళ్ల జీవితాలు ఎలా మార్చింది? ఈ కథలో ధృవ్ ఎందుకు భాగమవ్వాల్సి వచ్చింది? అసలు పోలీస్ కమ్ లాయర్ విద్యా జ్యోతి వీళ్ల జీవితాల్లోకి ఎందుకు వెళ్లింది? చివరికి అతడి పరిస్థితి ఏమైంది? అనేది “దో పత్తి” (Do Patti) కథాంశం.
నటీనటుల పనితీరు: కాజోల్ (Kajol) ను ఈ తరహా రఫ్ & టఫ్ పోలీస్ పాత్రలో చూడడం ఇదే మొదటిసారి కావడంతో ఆమె ఆ పాత్రను ప్లే చేసిన విధానం ఆడియన్స్ ను అలరిస్తుంది. కృతి సనన్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం పోషించిన తీరు బాగుంది. ముఖ్యంగా రెండు పాత్రలకి మంచి వేరియేషన్స్ చూపించింది. షాహీర్ షేక్ ఈ సినిమాలో పొగరుబోతుగా కనిపించిన తీరు చాలా రియలిస్టిక్ గా ఉంది.
సాంకేతికవర్గం పనితీరు: సంగీతం, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ & ప్రొడక్షన్ డిజైన్ అన్నీ ప్రాజెక్ట్ కు తగ్గట్లుగానే ఉన్నాయి. కనికా థిల్లాన్ రాసుకున్న కథలో సరైన పట్టు లేదు. భర్త పాత్రధారిని కేసులో ఇరికించడం కోసం చేసిన పనులు రీజనబుల్ గా లేవు. అదేదో పెద్ద ట్విస్ట్ లా కూడా అనిపించలేదు. పైగా కథను చివర్లో కొందరు మహిళలు ఇంట్లో ఎదుర్కొనే గృహ హింస అనేది మెయిన్ కాన్సెప్ట్ అన్నట్లుగా ఎలివేట్ చేసేసి.. సమాజం కోసం తీసిన సినిమా అంటూ కవర్ చేయడం అనేది వీక్ రైటింగ్ కి నిదర్శనం. ఇక రాసిన కథలోనే పట్టు లేనప్పుడు, దర్శకుడు శశాంక చతుర్వేది పనితనం గురించి ఇంకేం మాట్లాడతాం చెప్పండి.
విశ్లేషణ: ఓ సామాజిక సమస్యతో సినిమా తీస్తున్నప్పుడు రియాలిటీకి దగ్గరగా, నిజాయితీగా ఉండాలి. అవేమీ లేకుండా ఇష్టం వచ్చినట్లు సీన్స్ రాసుకొని చివరికి ఏదో సామాజిక బాధ్యతతో వ్యవహరించినట్లు భారతదేశంలో ఇన్ని కేసులు నడుస్తున్నాయి, ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి.. అంటూ సినిమాను ముగిస్తే సినిమాకు కనెక్ట్ అయిపోయే ఆడియన్స్ లేరు ఇప్పుడు. రచయితగా కనికా థిల్లాన్ ఇంకెప్పుడు అప్డేట్ అవుతుందో చూడాలి.
ఫోకస్ పాయింట్: ఈ పేకాటలో ఇది రాంగ్ షో!
రేటింగ్: 1.5/5