కమెడియన్ సునీల్ అంటే తెలియని వారుండరు. ఏపీలోని భీమవరంలో పుట్టి పెరిగి నటనపై ఉన్న ఆసక్తితో డిగ్రీ పూర్తి కాగానే సినిమాల్లో ఛాన్సుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే ఉన్న ఊరిని వదిలి సిటీకి వచ్చాడు. తొలుత డ్యాన్సర్ గా, ఆర్ట్ డైరెక్టర్ గా, విలన్ గా ఛాన్సుల కోసం చెప్పులరిగేలా తిరిగాడు. చివరకు కమెడియన్ గా చాన్స్ దక్కించుకుని సినిమాల్లోకి ప్రవేశించాడు. తనదైన పంచ్ డైలాగులతో కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.
బ్రహ్మానందం తరువాత అంతటి స్టార్ డమ్ సంపాదించుకున్న వర్సటైల్ కమెడియన్ సునీల్. స్టార్ కమెడియన్ అయిన తర్వాత సునీల్ హీరోగా అందాల రాముడు తీశాడు. ఆ సినిమా ఏవరేజ్ హిట్ గా నిలిచింది. కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో హీరోగా వెలుగు వెలిగాడు. రాజమౌళి దర్శకత్వంలో మర్యాద రామన్నతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూనే విలన్ గా రానిస్తున్నారు.
పుష్ప సినిమాలో చేసిన విలన్ పాత్రకు (Sunil) సునీల్ కు పాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ఈయన సౌత్ లో మరికొన్ని భాషల సినిమాల్లో కూడా ప్రాధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీ కాంత్ తో కలిసి నటించిన జైలర్ సినిమాలో సునీల్ కీలక పాత్ర పోషించాడు. అటు కమెడియన్ గా, హీరోగా, విలన్ గానే కాదు దర్శకుడిగా కూడా ఓ సినిమా చేశాడు సునీల్.
ఇంతకీ ఆ సినిమా ఏంటనుకుంటున్నారా.. అదే జక్కన్న. ఇందులో సునీల్ సరసన మన్నారా చోప్రా హీరోయిన్ గా నటించింది. 2016లో విడుదలైంది జక్కన్న. ఈ చిత్రం కమర్షియల్ గా విజయాన్ని అందుకోలేకపోయినా.. మంచి వసూళ్లు తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు వంశీకృష్ణ ఆకెళ్ల డైరెక్టర్ గా పని చేశాడు. అయితే తను కొత్త దర్శకుడు కావడంతో సినిమా ఔట్ పుట్ సరిగ్గా రాలేదట. దాంతో సునీల్ మెగా ఫోన్ పట్టి చాలా సన్నివేశాలకు తనే దర్శకత్వం వహించాడు. ఇలా జక్కన్న సినిమాతో సునీల్ దర్శకత్వ బాధ్యతలను కూడా నెరవేర్చాడు.