టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా ఎన్నో విజయాలను సొంతం చేసుకుని బండ్ల గణేష్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. గతేడాది కరోనా బారిన పడి కోలుకున్న బండ్ల గణేష్ కు మళ్లీ కరోనా నిర్ధారణ అయింది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రిలో బండ్ల గణేష్ కరోనాకు చికిత్స చేయించుకుంటున్నారు. కరోనా వైరస్ రెండోసారి సోకడం అరుదుగా మాత్రమే జరుగుతుంది. కేవలం 0.3 శాతం మందికి మాత్రమే రెండోసారి కరోనా వైరస్ సోకుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
అయితే ప్రస్తుతం బండ్ల గణేష్ ఆరోగ్యం బాగానే ఉందని ఆయన మెల్లిగా కరోనా నుంచి కోలుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనను ఐసీయూ నుంచి నార్మల్ వార్డుకు షిఫ్ట్ చేశారని సమాచారం. త్వరలో బండ్ల గణేష్ ను వైద్యులు డిశ్చార్జ్ చేయనున్నారని డిశ్చార్జ్ తరువాత బండ్ల గణేష్ ఇంట్లో చికిత్స తీసుకుంటే సరిపోతుందని తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే బండ్ల గణేష్ మామూలు మనిషి అవుతాడని వైద్యులు చెప్పారని బండ్ల గణేష్ సన్నిహితులు చెబుతున్నారు.
ఆస్పత్రిలో చేరిన సమయంలో బండ్ల గణేష్ పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉన్నా ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులకు కంగారు తగ్గింది. ఈ మధ్య కాలంలో వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనర్గళంగా పవన్ ను ప్రశంసిస్తూ మాట్లాడి బండ్ల గణేష్ వార్తల్లో నిలిచారు. బండ్ల గణేష్ స్పీచ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తన ఫేవరెట్ హీరో అయిన పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేష్ ఒక సినిమాను నిర్మించే పనిలో ఉన్నారు. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.