ఒక చిత్ర పరిశ్రమలో నంబర్ వన్ హీరోయిన్ కిరీటం దక్కించుకోవడం ఎంతో కష్టమైన పని. అటువంటిది టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు టాప్ హీరోయిన్ గా కొనసాగి కోట్లాది మంది మనసుల్లో స్థానం సంపాదించుకుంది శ్రీదేవి. తెలుగు వారందరూ అతిలోక సుందరిగా పిలుచుకునే ఈమె కొన్ని రోజుల క్రితం లోకం విడిచి వెళ్లారు. శ్రీదేవి హఠాన్మరణం ఆమె కుటుంబసభ్యులతో పాటు అభిమానులను శోక సముద్రంలో ముంచింది. ఇప్పుడిప్పుడే శ్రీదేవి (Sridevi) లేరనే వాస్తవాన్ని తట్టుకుంటున్నారు. మూడు భాషల్లో దాదాపు 270 సినిమాల్లో నటించిన శ్రీదేవి గురించి బయోపిక్ తీయడం అసాద్యమని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. శ్రేదేవి లాంటి అందమైన, ప్రతిభగల నటి ఇప్పుడు లేరని సంచలన కామెంట్స్ చేశారు. అందుకే శ్రీదేవి బయోపిక్ తీయడానికి ఎవరూ ముందుకురావడం లేదు.
దీంతో శ్రీదేవి భర్త బోనీ కపూర్ శ్రీదేవి జీవితం ఆధారంగా ఓ డాక్యుమెంటరీని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఆమె గురించి ప్రపంచానికి కొంచెమే తెలుసు.. ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. వాటన్నిటినీ ఈ డాక్యుమెటరీలో పొందుపరచాలని భావిస్తున్నారు. శ్రీదేవితో కలిసి నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల జ్ఞాపకాలతో ఈ డాక్యుమెంటరీని రూపొందించేందుకు బోనీకపూర్ ప్లాన్ చేశారు. దీని కోసం ఇప్పటికే దర్శకుడు శేఖర్‌కపూర్‌ని కూడా సంప్రదించారని సమాచారం. శేఖర్ కపూర్ దర్శకత్వం వహించిన ‘మిస్టర్ ఇండియా’ చిత్రంలో అనిల్‌కపూర్ కి జంటగా శ్రీదేవి నటించింది. ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇప్పుడు అతను తీయనున్న డాక్యుమెంటరీ కూడా అందరి మనసులను గెలుచుకుంటుందనడంలో
ఎటువంటి సందేహం అవసరం లేదు.