మ్యాజిక్ మొదటిసారి చూసినపుడు కలిగిన అనుభూతి తర్వాత చూసినపుడు కలగదు. సినిమా కూడా అలాంటిదే. ఓ భాషలో ప్రేక్షకులని మైమరపించిన సినిమా మరో భాషలో పునర్నిర్మించి అక్కడ అదే ఫలితాన్ని రాబట్టడం కష్టంతో కూడుకున్నదే. ముఖ్యంగా ప్రేమకథలకు ఇది బాగా వర్తిస్తుంది. మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ ఇంద్రజాలంలా అందరినీ మంత్రముగ్దుల్ని చేసిన సంగతి తెలిసిందే. అదే మ్యాజిక్ ని తెలుగులోనూ రిపీట్ చేయాలనీ చైతూ, చందు మొండేటి ప్రయత్నిస్తున్నారు.
వీరిద్దరి కలయికలలో తెరకెక్కిన ‘ప్రేమమ్’ రేపు విడుదల కానుంది. ఈ సందర్బంగా చైతూ సినిమా గురించి మాట్లాడుతూ “రీమేక్ అనగానే ఒత్తిడి ఉంటుంది. చాలామంది మలయాళ, తెలుగు చిత్రాల్ని పోల్చి చూస్తున్నారు. ఆ కథను తీసుకొని నేటివిటీ సహా పలు మార్పులు చేశాం. అలా అని ఆ సినిమాకి ధీటుగా ఉంటుందని చెప్పడం లేదు. అది వేరు, ఇది వేరు” అని అన్నాడు. ‘వేరు, కాండం ఒకటే కానీ కొమ్మకున్న ఆకు పక్క చెట్టుది’ అన్నట్టుంది చైతూ వరుస. కథ ఒకటే అయినపుడు ‘వేరు’ అవుతుందో..? ఇక ఈ ‘ప్రేమమ్’లో మీ ప్రేమ అనుభవాలు ఏమైనా ఉన్నాయా అన్న ప్రశ్నకు “అందరిలానే టీనేజ్, కాలేజ్ రోజుల్లో చిన్న కథలున్నాయని, సినిమాలోలా టీచర్ ని మాత్రం ప్రేమించలేద”న్నాడు. ఏదేమైనా ‘ప్రేమమ్’ మ్యాజిక్ కు తెలుగులో ఎలాంటి స్పందన లభించనుందన్నది రేపు తేలనుంది.