చిర్రెట్టుకొచ్చిందంటే.. తాను తలకిందులుగా నిల్చోడమే కాదు కుదిరితే థియేటర్లో జనాలని కూడా తలకిందులుగా సినిమా చూడమంటాడు. అవసరమనుకొంటే వెండితెరపై సినిమాను రివర్స్ లో ప్లే చేయమంటాడు, లేకుంటే ఏకంగా సినిమానే రివర్స్ లో తీసిపారేస్తాడు. అంత పిచ్చి ఉన్న ఏకైక సౌత్ ఇండియన్ హీరో ఉపేంద్ర. ఉపేంద్రకి ఉసిరికాయంత వెర్రి ఉందని ఆయన అభిమానులు కూడా సరదాకి చెప్పుకొంటుంటారు. అందుకు కారణం ఆయన తీసిన సినిమాలే. ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం “ఉపేంద్ర 2″ను రివర్స్ లో అంటే.. ఎండ్ టైటిల్స్ నుంచి థియేటర్స్ లో ప్లే చేసిన్ ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేసిన విధానం అయితే వచ్చే పదేళ్లవరకూ ఎవరూ మర్చిపోలేరు.
అలాంటి ఉపేంద్ర తన జీవితంపై ఒక పుస్తకం రాస్తున్నాడంటే ఎంతో మంది వెయిట్ చేస్తుంటారు. ఉపేంద్ర గురించి తమకు తెలియని విశేషాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకొందామని ఎదురుచూస్తున్న అభిమానులకు బుక్ రిలీజ్ కి ముందే షాక్ ఇచ్చాడు ఉపేంద్ర. తన ఆటోబయోగ్రఫీగా వ్రాయబడుతున్న పుస్తకానికి “ఇదన్న ఉడ్బెడి” అని పేరు పెట్టాడు. కన్నడ భాషలో “ఇదన్న ఉడ్బెడి” అంటే “ఇది చదవొద్దు” అని అర్ధం. అంటే తన పుస్తకం కవర్ పేజ్ పైన “ఇది చదవొద్దు” అని రాస్తున్నాడాయన. మరి ఆయనే స్వయంగా చదవొద్దు అని చెప్తున్నాక ఎంతమంది చదువుతారో చూడాలి. అయితే.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన ఉపేంద్ర జీవితాన్ని తెలుగులో చదవాలనుకొనేవారి కోసం తెలుగులో ఎవరైనా ట్రాన్స్ లేట్ చేసి ప్రింట్ చేస్తే బాగుండు.