దృశ్యం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

  • February 19, 2021 / 02:05 PM IST

2013లో మలయాళంలో విడుదలై అఖండ విజయం సొంతం చేసుకోవడంతోపాటు.. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో రీమేకై అక్కడ కూడా మంచి విజయం సొంతం చేసుకున్నా చిత్రం “దృశ్యం”. ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన చిత్రం “దృశ్యమ్ 2”. సేమ్ క్యాస్ట్ & క్రూతో తెరకెక్కిన ఈ సీక్వెల్ ఇవాళ (ఫిబ్రవరి 19) అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. మరి ఈ సీక్వెల్ సినిమా ప్రీక్వెల్ స్థాయిలో ఉందో లేదో చూద్దాం..!!

కథ: సరిగ్గా మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే మొదలవుతుందీ సీక్వెల్. జార్జ్ కుట్టి (మోహన్ లాల్) & ఫ్యామిలీ కేరళలోని ఓ గ్రామంలో కేబుల్ సర్వీస్ రన్ చేస్తూ సంతోషంగా బ్రతుకుంటారు. వారి జీవితాల్లోకి పోలీస్ ఆఫీసర్ గీత (ఆశా శరత్) కొడుకు రావడం, అతడ్ని జార్జ్ కుట్టి కూతురు చంపడం, ఆ బాడీని జార్జ్ కుట్టి పోలీస్ స్టేషన్ లోనే పాతిపెట్టి.. పోలీసులకి రుజువు దొరక్కపోవడంతో తన సాధారణ జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఇది మొదటి భాగం కథ.

జార్జ్ కుట్టి మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ లో పాతిపెట్టి బయటకి వస్తుండగా ఒక క్రిమినల్ చూసి అది పోలీసులకు చెప్పడంతో సీక్వెల్ మొదలవుతుంది. రెండేళ్లుగా సాగుతున్న ఈ ఇన్వెస్టిగేషన్ నుంచి ఈసారి జార్జ్ కుట్టి ఎలా బయటపడ్డాడు? తన కుటుంబాన్ని తెలివితేటలతో ఎలా కాపాడుకున్నాడు? అనేది “దృశ్యమ్ 2” కథాంశం.

నటీనటుల పనితీరు: మోహన్ లాల్ కంప్లీట్ యాక్టర్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించే ప్రతి సినిమాలోనూ పాత్రతో ప్రయాణం చేస్తాడు మోహన్ లాల్. అందుకే జార్జ్ కుట్టి పాత్రలోని క్రోధం, తప్పు చేశాననే బాధ, తన కుటుంబాన్ని కాపాడుకోవాలనే తపన అతడి కళ్ళల్లో తచ్చాడుతుంటాయి. డైలాగులు వినకుండా మోహన్ లాల్ కళ్ళకు పెట్టిన టైట్ క్లోజ్ షాట్స్ చూసినా చాలు సినిమా అర్ధమైపోతుంది. అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు మోహన్ లాల్.

మీనా ఆశా శరత్, మురళీ గోపీల పాత్రల కంటిన్యూటీ బాగుంది. ఆ పాత్రలో ఎలివేట్ అవ్వాల్సిన ఎమోషన్ ను వారు చక్కగా పండించారు.

సాంకేతికవర్గం పనితీరు: అసలు ఓ సక్సెస్ ఫుల్ సినిమాకి సీక్వెల్ తీయడం అనేదే పెద్ద రిస్క్. అలాంటి రిస్క్ ను సక్సెస్ ఫుల్ గా డెలివర్ చేయడం అనేది ఆషామాషీ విషయం కాదు. జీతూ జోసెఫ్ సీక్వెల్ ను మొదలెట్టిన సీక్వెన్స్ కానీ, చివరి గంట సినిమాను నడిపిన విధానం కానీ థియేటర్లో విడుదలై ఉంటే ప్రేక్షకుడు స్థాణువైపోయేవాడు. దృశ్యమ్ కు ఏమాత్రం తగ్గని విధంగా సీక్వెల్ ను తెరకెక్కించాడు జీతూ జోసెఫ్. ముఖ్యంగా క్లైమాక్స్ ను ముగించిన విధానం అద్భుతం. కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఓ సగటు వ్యక్తి ఎంత దూరమైనా వెళ్తాడు అనే అంశాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసి, హీరో పాత్రకు ఉన్న సినిమా పిచ్చిని క్లైమాక్స్ కు బేస్ గా పెట్టుకొని కథనాన్ని అల్లుకున్న విధానం ప్రశంసనీయం.

ఒకానొక స్టేజ్ లో ప్రొసీడింగ్ అర్ధమైపోయినా ఇక్కడినుంచి ముందుకు ఎలా సాగుతుంది అని డౌట్ పడే టైమ్ కి మలయాళ నటుడు సాయికుమార్ ను రైటర్ గా ఇంట్రడ్యూస్ చేసి ఆయన పాయింటాఫ్ వ్యూ నుంచి కథను నడిపిన విధానానికి విజిల్స్ పడడం ఖాయం. అన్నిటికంటే ముఖ్యంగా రెండేళ్లుగా ఓ కేస్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొనే చర్యలు, ఇన్వెస్టిగేషన్ ప్రొసెస్ ను చూపించిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. ఏదేమైనా “శవాల్ని ఎక్కడ దాచిపెట్టాలి” అనే అంశంలో దర్శకుడు జీతూ జోసెఫ్ పి.హెచ్.డి చేసి ఉంటాడు. లేదంటే ప్రతి సినిమాలో ఈ రేంజ్ ను ట్విస్టులను రాయడం అనేది మామూలు విషయం కాదు.

సంగీత దర్శకుడు, కెమెరామెన్, ఆర్ట్ డిపార్ట్ మెంట్, ప్రొడక్షన్ డిజైన్ అన్నీ బాగున్నప్పటికీ.. వాటన్నిటినీ దర్శకుడు జీతూ జోసెఫ్ బ్రిలియన్స్ డామినేట్ చేసేశాయి. అందువల్ల సినిమా చూస్తున్న ప్రేక్షకుడి మెదడులో నెక్స్ట్ సీన్ లో ఏం జరుగుతుంది అనే ఆలోచన తప్ప వేరే విషయాల మీదకు మనసు మర్లదు.

విశ్లేషణ: “దృశ్యం”కి సరిసమానమైన స్థాయిలో తెరకెక్కిన సీక్వెల్ “దృశ్యం 2”. మోహన్ లాల్ నటన, జీతూ జోసెఫ్ అద్భుతమైన డీలింగ్, షాకింగ్ క్లైమాక్స్ ట్విస్ట్ & స్క్రీన్ ప్లే కోసం “దృశ్యం 2″ను తప్పకుండా చూడాల్సిందే. మొదటి పార్ట్ తరహాలోనే సెకండ్ పార్ట్ ను కూడా అన్నీ భాషల్లో రీమేక్ చేసినా సూపర్ హిట్ అవ్వగల సత్తా ఉన్న సబ్జెక్ట్ ఇది.

రేటింగ్: 3/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus