స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించిన చిత్రం “దువ్వాడ జగన్నాధం”. ట్రైలర్ తోపాటు కథానాయిక పూజా హెగ్డే అందాలు ఈ సినిమాకి మంచి క్రేజ్ ను తీసుకువచ్చాయి. “సుబ్రమణ్యం ఫర్ సేల్” అనంతరం హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడం.. “ఆర్య, పరుగు, ఎవడు” తర్వాత అల్లు అర్జున్-దిల్ రాజుల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో “దువ్వాడ జగన్నాధం”పై భారీ అంచనాలే ఉన్నాయి. మరి డిజే ఆ అంచనాలను అందుకునే స్థాయిలో ఉన్నాడో లేదో చూద్దాం..!!
కథ : శ్రీవత్సస గోత్రంలో పుట్టిన బ్రాహ్మణ యువకుడు దువ్వాడ జగన్నాధం. వృత్తిపరంగా వంట బ్రాహ్మణుడు అయినప్పటికీ.. ఎదుటి మనిషి కష్టాన్ని చూసి తట్టుకోలేక డీజేగా మారి అన్యాయాన్ని అంతమొందిస్తుంటాడు. అగ్రో డైమెండ్ అనే ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ కారణంగా కొన్ని వందల కుటుంబాలు లక్షల్లో డబ్బు నష్టపోవడంతోపాటు రోడ్డున పడతాయి. అప్పుడు డీజే రంగంలోకి దిగి ఈ గొడవ సద్దుమణిగేలా చేయాలని ప్రయత్నాలు మొదలుపెడతాడు. అయితే.. ఇందుకు మూలకారకుడు అందరూ అనుకొంటున్నట్లుగా స్టీఫెన్ రాకేష్ కాదని, రొయ్యల నాయుడు (రావు రమేష్) అనే పెద్ద ఇండస్ట్రీలిస్ట్ అని తెలుసుకొంటాడు డిజే. ఈలోపు హోమ్ మినిస్టర్ పుష్పం (పోసాని) కుమార్తె పూజ (పూజ హెగ్డే)తో ప్రేమలో పడడం.. అలా ఆమెతో సరసాలాడుతూనే సమస్యలను తీరుస్తూ ఉంటాడు. కానీ.. డీజే కంటే కాస్త తెలివి ఎక్కువగల రొయ్యల నాయుడు మాత్రం డిజే ఆడుతున్న చదరంగంలోని పావులను కొంచం ముందుగానే కదిపి.. కుదేలు చేస్తాడు. ఆ తర్వాత డిజే మరియు అతడి కుటుంబం ఎదుర్కొన్న కష్టాలేమిటి, వాటిని దువ్వాడ జగన్నాధం ఎలా ఎదుర్కొన్నాడు, చివరికి అగ్రో డైమెండ్ బాధితులకు న్యాయం చేయగలిగాడా లేదా అనేది “దువ్వాడ జగన్నాధం” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు : అల్లు అర్జున్ డీజే పాత్రలో స్టైలిష్ లుక్ లో పర్లేదు కానీ.. దువ్వాడ జగన్నాధం అనే బ్రాహ్మణుడి పాత్రకి మాత్రం న్యాయం చేయలేకపోయాడు. డ్యాన్స్, ఫైట్స్ విషయంలో మాత్రం తన సీనియారిటీని ప్రూవ్ చేసుకొన్నాడు. పూజ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. ఇంట్రడక్షన్ ఫ్రేమ్ మొదలుకొని “సీటీ మార్” సాంగ్ వరకూ కుదిరినప్పుడల్లా కుదురినంతలో ఏమాత్రం మొహమాటం లేకుండా నగుమోము నుంచి నాభి వరకూ చూపించిన పార్ట్ మళ్ళీ అదే యాంగిల్ లో చూపించకుండా కుర్రకారుకు పిచ్చెక్కించింది. తాను నటించే ప్రతి సినిమాలో.. తనదైన మేనరిజమ్ తో పాత్రకు ప్రాణం పోసే రావు రమేష్.. ఈ సినిమాలో తన తండ్రి రావుగోపాల్రావును ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు కానీ.. ప్రేక్షకులను ఇరిటేట్ చేశాడు.
సాంకేతికవర్గం పనితీరు : తన సినిమాలోవే కావడంతో అధికారికంగా వాడుకొన్నాడో లేక వరుసబెట్టి సినిమాలు చేస్తుండడం వల్ల క్లారిటీ మిస్ అయ్యాడో తెలీదు కానీ.. దేవిశ్రీప్రసాద్ పాటల్లో ఒక్క “అస్మైక యోగ” మినహా మిగతా పాటలన్నీ ఎక్కడో విన్నట్లే ఉన్నాయి. అయితే.. నేపధ్య సంగీతంతో సినిమాని బ్రతికించాడు దేవి. అయనాంక బోస్ సినిమాటోగ్రఫీ వర్క్ నిర్మాణ విలువలకు అద్ధం పట్టింది. సినిమా చాలా రిచ్ గా గ్రాండ్ గా కనిపించడానికి కూడా ముఖ్యకారకుడు అయనాంక బోస్. బేసిక్ గా మంచి రైటర్ అయిన హరీష్ శంకర్ ఈ సినిమాలో మేనరిజమ్స్ ను రిపీట్ చేసిన విధానం సినిమాకి పెద్ద మైనస్. హీరో చేత అస్తమానం “సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని, రచ్చో రచ్చస్య రచ్చోబ్యహ” లాంటి డైలాగ్స్ ను పదే పదే చెప్పించడం వల్ల ట్రైలర్ చూసినప్పుడు కలిగిన పాజిటివ్ ఫీల్ సినిమా చూసినప్పుడు మాత్రం కలగదు. పైగా.. హీరోను విలన్స్ ను సెంటర్ లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కొట్టే సీన్ లో “భాషా” సినిమా గుర్తుకురావడం, క్లైమాక్స్ లో ట్విస్ట్ పక్కన పెడితే కనీసం లాజిక్ అనేది ఎక్కడా కనిపించకుండా ముగించిన విధానం చూసి అల్లు అర్జున్ వీరాభిమానులు ఏమైనా హర్షించవచ్చేమో కానీ.. సగటు సినిమా అభిమాని మాత్రం “ఏం సినిమారా బాబు” అనుకుంటూ థియేటర్ వీడతాడు.
రైటర్ గా వర్క్ చేస్తున్న సమయంలో “అదుర్స్” సినిమాలో ఎన్టీయార్ బ్రాహ్మణ పాత్రను అద్భుతంగా డిజైన్ చేసిన హరీష్ శంకర్.. తాను దర్శకుడిగా తీసిన సినిమా “దువ్వాడ జగన్నాధం”లో మాత్రం అల్లు అర్జున్ కు స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ను క్రియేట్ చేయకపోవడం గమనార్హం. సినిమాకి అదే పెద్ద మైనస్ అని చెప్పాలి. ఏదో ఫ్యాన్స్ కోసం పెట్టిన ఓ నాలుగైదు ఎలివేషన్ షాట్స్ మినహా.. సినిమా మొత్తం “రొట్టో రొట్టస్య రొట్టబ్యహ” అనేలా ఉంది.
విశ్లేషణ : ఇలాంటి సినిమా తీసి సభ్య సమాజానికి హరీష్ శంకర్ ఏం మెసేజ్ ఇద్దామనుకొన్నాడో తెలియదు కానీ.. ప్రేక్షకులను మాత్రం ఎంటర్ టైన్ చేయలేకపోయాడు. సో, అల్లు అర్జున్ వీరాభిమానులు మినహా ఈ డీజేను ఎవరూ ఎంజాయ్ చేయలేరనే చెప్పాలి.