హీరో ఎక్కడకు వెళ్లినా ఆయన ఫ్యాన్స్.. రాబోయే సినిమానో, లేక కొత్త సినిమా గురించో అడగడం కామన్. హీరో ఆ విషయం చెప్పేంతవరకు దాని గురించి కేకలు వేస్తూ సందడి చేస్తూనే ఉంటారు. అయితే ఇది మిగిలిన హీరోలందరికీ ఓకేనేమో కానీ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దగ్గర కాదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు బయటకు వస్తున్నారు అంటే.. అది ఎక్కువగా డిప్యూటీ సీఎంగా. ఈ విషయాన్ని ఆయన ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు కూడా. ఈ విషయంలో సినిమా నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ కూడా ఓ నోట్ రిలీజ్ చేసింది.
ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓజీ’ (OG Movie). చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా అప్‌డేట్స్ కోసం అభిమానులు గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఓవైపు సినిమా షూటింగ్ అవుతోంది అని చెబుతున్నా అప్‌డేట్ రావడం లేదు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ డీవీవీని అప్‌డేట్ కోసం అడిగిన ఫ్యాన్స్, రీసెంట్‌గా పవన్ అఫీషియల్ పర్యటనలో అడిగారు. దీంతో నిర్మాణ సంస్థ తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. ‘ఆయన్ని ఇబ్బంది పెట్టకండి’ అనేది ఆ పోస్టు సారాంశం.
‘ఓజీ’ సినిమాపై మీరు చూపిస్తోన్న ప్రేమాభిమానాలు మా అదృష్టం. మా చిత్రాన్ని మీ ముందుకు తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నాం. పవన్ కల్యాణ్ రాజకీయ సభలకు, ప్రభుత్వపరమైన వెళ్లినప్పుడు, సమయం, సందర్భం చూడకుండా ‘ఓజీ ఓజీ’ అని అరవడం సరికాదు. సినిమా అప్‌డేట్ కోసం ఆయన్ని ఇబ్బందిపెట్టడం సరికాదు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారో మనకు తెలుసు. ఆ స్థానాన్ని, స్థాయిని గౌరవించడం మన బాధ్యత. సినిమా అప్‌డేట్ కోసం కొన్ని రోజులు ఓపికగా ఎదురుచూద్దాం.
2025లో ఓజీ పండుగ ఘనంగా జరగనుంది అని ఆ నోట్‌లో రాసుకొచ్చింది డీవీవీ టీమ్. ఇటీవల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబును పరామర్శించడానికి శనివారం మధ్యాహ్నం పవన్ కల్యాణ్ కడప రిమ్స్‌కు వెళ్లారు. ఆ దాడి గురించి ఆయన సీరియస్‌గా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అభిమానులు ‘ఓజీ ఓజీ’ అని అరిచారు. దీనిపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటయ్యా మీరు. ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో తెలియదా. పక్కకు జరగండి అని అసహనం వ్యక్తం చేశారు.