మంచు విష్ణు సినిమాలు ఓ రకం. రాజ్ తరుణ్ సినిమాలు మరో రకం. ఇద్దరూ కామెడీ సినిమాలతో హిట్లు కొట్టినా.. దారులు మాత్రం చెరోరకం. యాక్టింగ్, కామెడీ టైమింగ్ వేర్వేరు. ఇద్దరి కలయికలో దర్శకుడు జి.నాగేస్వర రెడ్డి ‘ఈడోరకం ఆడోరకం’ సినిమా తీశారు. ఏటీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి.పై రూపొందిన ఈ సినిమా నేడు విడుదలైంది.
కథ : అర్జున్(మంచు విష్ణు), అశ్విన్(రాజ్ తరుణ్) మంచి మిత్రులు. ఫ్రెండ్ పెళ్లిలో నీలవేణి (సోనారిక) ని చూసి అర్జున్ ప్రేమలో పడతాడు. ఇదే పెళ్ళిలో అశ్విన్ ని చూసి సుప్రియ(హేభా పటేల్) మనసు పారేసుకుంటుంది. అనాథను మాత్రమే పెళ్లి చేసుకుంటానని నీలవేణి స్నేహితురాళ్ళతో చెప్తుంది. ఇది విన్న అర్జున్ నీలవేణితో అనాథనని అబద్దం చెప్తాడు. సిటీలో పెద్ద రౌడీ అయిన నీలవేణి అన్నయ్య చెల్లెలి ప్రేమను అంగీకరించి వెంటనే పెళ్లి చేస్తాడు. అర్జున్ ఇంట్లోనే పైఅంతస్తులో నీలవేణి అద్దెకు దిగుతుంది. అక్కడనుంచి అసలు కష్టాలు మొదలవుతాయి. ఇంట్లో మేనేజ్ చేయడం కోసం అశ్విన్ భార్య నీలవేణి అని చెప్తాడు. సుప్రియను పెళ్లి చేసుకోవడానికి, వాళ్ళింట్లో లాయర్ నారాయణ(రాజేంద్ర ప్రసాద్) కొడుకునని అశ్విన్ అబద్దం చెప్తాడు. నారాయణ ఎవరో కాదు అర్జున్ తండ్రి. నా కొడుకు సుప్రియను పెళ్లి చేసుకున్నాడని నారాయణ కుటుంబ సభ్యులు నమ్ముతారు. అసలు ఎవరు ఎవర్ని పెళ్లి చేసుకున్నారు? ఎవరి భార్య ఎవరు? అర్జున్, అశ్విన్ కలసి ఆడుతున్న ఈ నాటకాలు కనీసం వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యలకు అయినా తెలుసా? ఈ ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
నటీనటుల పనితీరు : ‘ఢీ’, ‘దేనికైనా రెడీ’, ‘దూసుకేళ్తా’.. తాజాగా ‘ఈడోరకం ఆడోరకం’ మంచు విష్ణు నటనలో పెద్దగా మార్పు ఏమీ లేదు. చేసిన పాత్రను మళ్లీ మళ్లీ చేసినట్టుంది. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్.. పెద్దగా మార్పులు కనిపించడం లేదు. రాజ్ తరుణ్ కాస్త పర్వాలేదు. తన బాడీ లాంగ్వేజ్ కి సరిపడా సీన్ పడిన ప్రతిసారీ కామెడీ టైమింగ్ తో కుమ్మేశాడు. నటన మీద సోనారికా అస్సలు దృష్టి పెట్టలేదు. అందాల ఆరబోతలో మొహమాట పడలేదు. పాటల్లో శృతి మించి అందాలు చూపింది. ‘కుమారి 21ఎఫ్’ తరహాలో ఉంది హేభా పటేల్ క్యారెక్టర్. గత సినిమాను మించి ఓ పాటలో శృంగారత్మకంగా కనిపించింది.
రాజేంద్ర ప్రసాద్ ఓవర్ యాక్టింగ్ చేశారు. రవిబాబు, రాజేంద్ర ప్రసాద్ మధ్య సంభాషణల్లో డబల్ మీనింగ్ డైలాగులు ఎక్కువయ్యాయి. పోసాని కృష్ణమురళీ పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో పర్వాలేదనిపించారు. అభిమన్యు సింగ్, గీతా సింగ్, ప్రభాస్ శీను, ఫిష్ వెంకట్ తదితరులవి అతిథి పాత్రల్లా కనిపిస్తాయి.
సంగీతం – సాంకేతిక వర్గం: సాయికార్తీక్ పాటల్లో రొటీన్ కమర్షియల్ బీట్, రిథమ్ మినహా ఇంకేవీ వినిపించవు. గుర్తుంచుకునే పాటల్లేవ్, ప్రాస కోసం పాటల రచయితలు చాలా పాట్లు పడ్డారు. సినిమాకి తగ్గట్టు రొటీన్ మ్యూజిక్ తప్ప కొత్తగా ప్రయత్నించడం లేదు. రీ-రికార్డింగ్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. క్లైమాక్స్ ఫైట్ ఏవరేజ్. ‘డైమండ్’ రత్నం మాటల్లో కూడా ప్రాస ప్రేక్షకులకు నస పెట్టింది. దానికి తోడు బూతు ఎక్కువైంది.
దర్శకత్వం : జి.నాగేశ్వర రెడ్డి గత సినిమాలు ‘సీమశాస్త్రి’, ‘సీమ టపాకాయ్’, ‘దేనికైనా రెడీ’లలో కథ పర్వాలేదు. లాజిక్కులను పక్కనపెడితే కామెడీ సీన్లు కరెక్టుగా పేలాయి. వినోదంతో సినిమా అంతా సెట్ రైట్ చేశారు. ఈ సినిమాలో దర్శకుడు ఆ లాజిక్ రిపీట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. కథ చాలా చిన్నది. కంటెంట్ అంతా ప్రథమార్థంలో చెప్పేశాడు. ద్వితీయార్థం బండి లాగించడానికికి, కథకు ముగింపు ఇవ్వడానికి పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు.
విశ్లేషణ : కన్ఫ్యూజన్ కామెడీ జోనర్ సినిమా అని యూనిట్ సభ్యులు చెప్పారు. కానీ, క్రిస్టల్ క్లియర్ గా ప్రతి ఫ్రేమూ ప్రేక్షకులకు అర్థం అవుతుంది. పైగా ఇదేమీ కొత్త కథ కూడా కాదు. ఓ ఇంట్లో ప్రధాన పాత్రధారులు అందరూ కలసి కామెడీ చేసే కంగాళీ సినిమా. తరచూ బ్రహ్మానందం కనిపించే పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటించారంతే. క్లైమాక్స్ సీన్లో హేభా పటేల్ ‘నేను కన్వీన్స్ అయ్యాను..’ అని డైలాగ్ చెప్తుంటే.. మేము కన్వీన్స్ కాలేదని ఆడియన్స్ అనుకునే పరిస్థితి. ఎంత రొటీన్ కంటెంట్ అయినా.. కామెడీ సరిగ్గా వర్కౌట్ అయితే పాస్ మార్కులు వేసేయొచ్చు. ఆ కామెడీలో ‘డైమండ్’ రత్నం మాటలు కలుక్కుమంటూ ఇబ్బందిపెట్టాయి. బూతు బాగా వినిపించింది. ఉమ్మడి కుటుంబం ప్రాముఖ్యత చెప్పాలని ప్రయత్నించారు. అది మాటలకు మాత్రమే పరిమితమైంది. సన్నివేశాల్లో ఎక్కడా ఆ భావన కలగలేదు. సినిమాలో ఎక్కడా లవ్, ఎమోషన్, సెంటిమెంట్ అనే ఫీలింగ్స్ కనిపించలేదు. అక్కడక్కడా కామెడీ పర్వాలేదు.
‘ఈడోరకం ఆడోరకం’ : అదో రకంగా రొటీన్ సినిమా తీసేశారు!