సునీల్, సుష్మా రాజ్, రిచా పనాయ్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఈడు గోల్డ్ ఎహే’ చిత్రం ఈరోజు విడుదలయ్యింది. వీరూ పోట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. సాగర్ ఎం.శర్మ సంగీతం అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ బోర్డ్ నుంచి U/A సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది. లవ్, రొమాంటిక్, కామెడి, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘ఈడు గోల్డ్ ఎహే’ చిత్రం దసరా కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!
కథ : బంగార్రాజు(సునీల్) ఓ అనాధ. తనకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్తుంటాడు. బంగార్రాజును జయసుధ తన పెద్ద కొడుకుగా చేరదీస్తుంది. ఈ కుటుంబానికి చెందిన వ్యాపారం చూసుకుంటూ ఉంటాడు బంగార్రాజు. అయితే కొంతమంది బెట్టింగ్ క్రిమినల్ గ్యాంగ్ మరియు మరికొంత మంది బంగార్రాజును సునీల్ వర్మ అనుకొని వెంటపడుతుంటారు.
అసలు సునీల్ వర్మ ఎవరు? వాళ్ళకి ఈ క్రిమినల్ గ్యాంగ్ కి ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఈ సమస్యల నుంచి బంగార్రాజు ఎలా బయటపడ్డాడు అనేది మిగతా కథాంశం.
నటీనటుల పనితీరు : సునీల్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తన కామెడి టైమింగ్, యాక్టింగ్, డాన్సులతో బాగా చేశాడు. హీరోయిన్లు ఇద్దరూ కూడా గ్లామర్ పాత్రలకే పరిమితమయ్యారు. ఒకరిని మించి మరొకరు పోటీపడి అందాలు అరబోసారు. కానీ హీరో-హీరోయిన్ల లవ్ ట్రాక్ ఆకట్టుకునేలా లేదు. పృధ్వీ, షకలక శంకర్, వెన్నెల కిషోర్ ల కామెడి ట్రాక్స్ బాగున్నాయి. ఇక జయసుధ, అరవింద్, నరేష్ తదితరులు తమ తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. ఈ సినిమాకు ట్విస్ట్ లు బాగా హెల్ప్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లలో వచ్చే ట్విస్ట్‌లు అదిరిపోయాయి. అయితే ట్విస్టులు బాగానే ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే అనుకున్న స్థాయిలో లేకపోవడం మైనస్ గా మారింది. కొన్ని కొన్ని సీన్లు తప్ప మిగతా సీన్లు బోర్ కొడతాయి. విలన్ పాత్ర కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. మొత్తానికి నాలుగు ట్విస్టులు, మూడు కామెడి సీన్లు, ఇద్దరు భామల అందాల ప్రదర్శనతో సాగిపోయింది.
సాంకేతికవర్గం పనితీరు : దర్శకుడు వీరుపోట్ల తాను రాసుకున్న కథకు ట్విస్టులు బాగానే రాసుకున్నప్పటికీ స్క్రీన్ ప్లేను మాత్రం సరైన విధంగా డిజైన్ చేసుకోలేకపోయాడు. కేవలం కామెడితోనే లాగించేయాలని ప్రయత్నించినట్లుగా అనిపిస్తుంది. దర్శకుడిగా వీరుపోట్ల పర్వాలేదనిపించాడు. దేవరాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సాగర్ ఎం.శర్మ పాటలు అస్సలు బాగోలేవు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. ఎడిటింగ్ అస్సలు బాగోలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
విశ్లేషణ : కాసేపు రొటీన్ కామెడి ఎంటర్ టైనర్ ఫీల్ అవ్వాలనుకునే ప్రేక్షకులకు మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది. అక్కడక్కడ ట్విస్టులు, కామెడితో పర్వాలేదనిపిస్తోంది.
రేటింగ్ : 1.5/5