ఇటీవల హీరోయిన్ ఇషా రెబ్బా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. తన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిహి’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ హీరోగా నటించగా, ఇద్దరూ కలిసి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు. జనవరి 30న సినిమా విడుదల కాబోతుండటంతో ప్రమోషనల్ హడావిడి మామూలుగా లేదు.
ఈ ఇంటర్వ్యూలో ఇషా, ఆంధ్ర-తెలంగాణ యాసల గురించి తన అనుభవాన్ని చాలా సింపుల్‌గా చెప్పుకొచ్చింది. “నాకు తెలంగాణ యాస మాట్లాడటం కాస్త కష్టంగా అనిపిస్తుంది. మాట్లాడితే గట్టిగా, కొట్టినట్టే ఫీల్ వస్తుంది. కానీ వినడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఆ యాసలో ఒక గౌరవం కనిపిస్తుంది” అని ఆమె చెప్పింది. అదే సమయంలో ఆంధ్ర యాస గురించి కూడా మాట్లాడుతూ, “డైరెక్ట్‌గా మాట్లాడే స్టైల్ ఉంటుంది. మాటలు కొంచెం హార్ష్‌గా అనిపించినా అందులో ఓ ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది” అని వివరించింది.
అయితే ‘కొట్టినట్టు ఉంటుంది’ అన్న మాటను కొందరు నెటిజన్లు ఇబ్బందిగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొందరు మాత్రం ఇషా ఉద్దేశం అవమానించడం కాదని, యాసల మధ్య ఉన్న తేడాను తన అనుభవంగా చెప్పిందని సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ కామెంట్స్‌తో సోషల్ మీడియా మరోసారి హీట్ అయింది.
ఇదే ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై కూడా ఇషా క్లారిటీ ఇచ్చింది. “మన చేతిలో లేని విషయాలను ప్లాన్ చేయలేం. సరైన సమయానికి అన్నీ జరుగుతాయి. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే నేనే చెబుతాను” అంటూ చాలా కూల్‌గా స్పందించింది. మొత్తంగా చూస్తే, ఇషా రెబ్బా మాటలు వివాదం కోసం కాకుండా, భాషలపై తన వ్యక్తిగత అనుభవాన్ని సాదాసీదాగా చెప్పినవే అని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న ఈ సమయంలో, ఈ చర్చలు చిత్రంపై ఆసక్తిని మరింత పెంచాయనడంలో సందేహం లేదు.