చుట్టూ అంతర్జాతీయ సినిమాలు.. మధ్యలో ఒకే ఒక్క బాలీవుడ్ సినిమా. ఎంత గొప్పగా ఉంటుంది చెప్పండి ఆ సీన్ చూశాక ఆ సినిమా టీమ్‌కి. అదిరిపోతుంది కదా ఆ ఫీలింగ్. ఇప్పుడు ఇలాంటి అనుభూతిలోనే ఉన్నారు ప్రముఖ దర్శకులు కబీర్ ఖాన్, ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్, ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్. ఎందుకంటే ఆ మధ్యలో నిలిచిన ఏకైక భారతీయ సినిమా వారిదే కాబట్టి. ఈ కాంబినేషన్ విన్నాక ఆ సినిమా ‘టైగర్’ సిరీస్‌లోనిదే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోని తొలి సినిమా ‘ఏక్ థా టైగర్’ ఈ గౌరవం దక్కించుకుంది.
వాషింగ్టన్ డీసీలోని ఇంటర్నేషనల్ స్పై మ్యూజియంలో ప్రపంచ ప్రఖ్యాత స్పై సినిమాల పోస్టర్‌లతో ఓ వాల్ లాంటి దానిని పెట్టారు. అందులో ‘మిషన్ ఇంపాజిబుల్’, ‘జేమ్స్ బాండ్’ లాంటి అంతర్జాతీయ సినిమాఉ ఉన్నాయి. అందులో ‘ఏక్ థా టైగర్’ కూడా ఉంది. ఈ గౌరవం అందుకున్న తొలి భారతీయ సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని ఆ సినిమా దర్శకుడు కబీర్ ఖాన్ తెలిపారు. తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. దీంతో ఆ ఫొటో, పోస్టర్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేసిందనేదే కాదు. ఎంతకాలం ప్రేక్షకులకు గుర్తున్నది అనేది కూడా ముఖ్యం. 2012లో విడుదలైన ‘ఏక్ థా టైగర్’ అప్పుడు అత్యధిక కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా పొందింది. ఇప్పటికీ ఈ సినిమా గురించి ప్రేమగా మాట్లాడుతుండడం ఆనందంగా ఉంది అని రాసుకొచ్చారు కబీర్ ఖాన్. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ సినిమా యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందించారు. ఈ సినిమాను ఆనుకొనే ఆ స్పై యూనివర్స్‌లో వరుస సినిమాలు వస్తున్నాయి. ఇటీవల వచ్చిన ‘వార్ 2’ కూడా ఆ యూనివర్స్‌లోనిదే.
ఇదంతా ఓకే ఆ పోస్టర్‌లో ఏయే సినిమాలు ఉన్నాయి అని అనుకుంటున్నారా? ‘కేసినో రాయ్’, ‘మిషన్ ఇంపాజిబుల్’, ‘స్పై గేమ్’, ‘టింకర్ టైలర్ సోల్జర్ స్పై’, ‘సెవన్‌టీన్ మూమెంట్స్ ఆఫ్ స్ప్రింగ్’, ‘ఓకేఎస్‌ఎస్ 117’, ‘జి మెన్’, ‘ది ఇమిటేషన్ గేమ్2, ‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’, ‘బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్’, ‘హోంలాండ్’, ‘అలియాస్’, ‘ఫౌడా’, ‘ది ప్రిజనర్’, ‘ గెట్ స్మార్ట్’, ‘మెన్ ఇన్ బ్లాక్’, ‘ది సీజ్, టర్న్: వాషింగ్టన్ స్పైస్’, ‘ది మేన్ ఫ్రంమ్ అంకుల్’ లాంటివి ఉన్నాయి.