థియేటర్‌లో ఒక షో అయిందంటే చాలు పైరసీ సీడీ / డీవీడీ ఇచ్చేసింది. డిస్క్‌ల రోజులు పోయాక ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌కి సినిమా పెట్టేస్తున్నారు. ఓటీటీలు వచ్చాక ఇది ఇంకా ఈజీ అయిపోయింది. సినిమా స్ట్రీమింగ్‌కి రావడం ఆలస్యం డౌన్‌లోడ్ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేస్తున్నారు. టెక్నాలజీ ఇంతలా విచ్చలవిడిగా వాడేస్తున్న ఈ సమయంలో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram ) ‘క’ (KA) సినిమా ఇంకా పైరసీ రాలేదు అంటే నమ్ముతారా? కావాలంటే ఓసారి ఈటీవీ విన్ (ETV Win) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ చూడండి మీకే అర్థమవుతుంది.
సినిమా ఇలా స్ట్రీమింగ్‌కి రావడం ప్రారంభమైంది చాలు.. టీమ్ వరుస మీమ్స్‌తో సందడి చేసింది. హ్యాకర్లు తమ డొమైన్‌లోకి చొరకబడి సినిమాను డౌన్‌లోడ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను తాము సమ్థంగా ఎదుర్కొన్నాం అంటూ మీమ్స్ రూపంలో చెప్పడం ప్రారంభించారు. వాళ్లు చెప్పినట్లే ఇప్పటివరకు ఓటీటీ ప్రింట్ బయటకు రాలేదు. దీనికి కారణం ఏంటా అని చూస్తే.. ఈటీవీ విన్ గతంలో ఓసారి చేసిన ప్రయత్నాన్ని ఈ సినిమాకూ చేయడమే అంటున్నారు.
సినిమాను ఈటీవీ విన్ (ETV Win) యాప్‌లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే బ్రౌజర్లలో వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూస్తామంటే కుదరదు. కేవలం టీవీ, మొబైల్ యాప్‌లో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. దీంతో సినిమాను అనధికారికంగా డౌన్‌లోడ్ చేయడం కుదరడం లేదు అంటున్నారు. గతంలో వచ్చిన నరేశ్ (Naresh) ‘వీరాంజనేయులు విహారయాత్ర’ (Veeranjaneyulu Viharayathra) సినిమాకు కూడా ఇదే తరహాలో పైరసీని ఆపగలిగారట.
ఆ సినిమా వచ్చిన సమయంలో దమ్ముంటే పైరసీ చేసుకోమని నరేశ్ సవాలు విసరడం తెలసిందే. ఇంత టెక్నికల్ దొంగ బుద్ధులు ముందుకు వెళ్లకుండా ఆపిన ఈటీవీ విన్ ఇప్పుడు మిగిలిన ఓటీటీలకు ఆదర్శం అని అంటున్నారు. ఎందుకంటే పైరసీ బెడద వారికి బాగా ఎక్కువగా ఉంది. మరి విన్ టీమ్‌ను మిగిలిన ఓటీటీ సంస్థలు ఏమన్నా స్ఫూర్తిగా తీసుకుంటాయో లేదో చూడాలి.