యురేక సినిమా రివ్యూ & రేటింగ్!

కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చి మనల్ని అలరించాయి. ‘శివ’ వంటి యాక్షన్ ఎంటర్టైనర్ నుండీ చెప్పుకుంటూ వస్తే.. ‘చిత్రం’ ‘నువ్వు నేను’ వంటి ప్రేమకథలు కూడా రూపొందాయి. అయితే అవన్నీ డిగ్రీ కాలేజీ నేపథ్యంలో వచ్చిన చిత్రాలు. వాటికి భిన్నంగా.. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీ నేపథ్యంలో ‘హ్యాపీ డేస్’ అనే చిత్రం వచ్చి అప్పట్లో కొత్త ట్రెండ్ సృష్టించింది. అటు తరువాత ‘కేరింత’ ‘కిరాక్ పార్టీ’ వంటి చిత్రాలు కూడా వచ్చాయి. అయితే అవన్నీ లవ్ అండ్ ఫ్రెండ్ షిప్ జోనర్ కు సంబందించిన చిత్రాలు. కానీ కాలేజీ బ్యాక్ డ్రాప్ లో కూడా ఓ మర్డర్ మిస్టరీ తీస్తే ఎలా ఉంటుంది.. అనే ఇంట్రెస్టింగ్ లైన్ తో తాజాగా ‘యురేక’ అనే చిత్రం తెరకెక్కింది. టీజర్, ట్రైలర్ ల తోనే ఈ చిత్రం పై అంచనాలు పెరిగాయి. మరి వాటి స్థాయిలో సినిమా మెప్పించిందా..? తెలుసుకుందాం రండి..!

కథ: అనగనగా ఓ ఇంజనీరింగ్ కాలేజీ. అందులో మెకానికల్ బ్రాంచ్ కు చెందిన సీనియర్ స్టూడెంట్ యువ(కార్తీక్ ఆనంద్) .. అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కు చెందిన సీనియర్ స్టూడెంట్ రేవంత్(మున్నా) లకు అస్సలు పడదు. అలాగే ఈ రెండు బ్రాంచ్ ల స్టూడెంట్స్ మధ్య కూడా ‘పచ్చ గడ్డి వేస్తె భగ్గుమనేలా’ గొడవలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఈ రెండు బ్రాంచ్ ల విద్యార్థులు ఎప్పుడూ గొడవ పడుతుండడంతో.. కాలేజీ యాజమాన్యం ‘కాలేజీ ఫెస్ట్’ ను జరపడానికి అడ్డంకులు వేస్తుంది. కానీ ఎటువంటి గొడవలు జరుగకుండా.. ‘నేను జరిపిస్తాను’ అని రేవంత్ ముందుకు వస్తాడు. అయితే ఫెస్ట్ జరగనివ్వను అంటూ యువ అతనితో ఛాలెంజ్ చేసి.. అడుగడుగునా అడ్డుపడుతుంటాడు. కానీ ఇంతలో ఓ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అమ్మాయి శోభిత(డింపుల్ హయతి) తో ప్రేమలో పడతాడు యువ. తన ప్రేమ వల్ల మనసుమార్చుకుని.. కాలేజీ ఫెస్ట్ కు ఎటువంటి ఆటంకాలు కల్పించనని ఆమెకి మాట ఇచ్చి.. ఆ పనుల్లో తాను కూడా జాయిన్ అవుతాడు. ఈ క్రమంలో ఆఫీస్ రూమ్ కి వెళ్ళి ‘ప్రైజ్ మెడల్స్’ తీసుకురమ్మని లెక్చరర్ చెబితే ఆ పని మీద వెళ్తాడు. అలా వెళ్లిన యువకి అక్కడ ఓ డెడ్ బాడీ కనిపిస్తుంది. ఎవరికైనా చెప్తే ఆ మర్డర్ తనే చేసాడు అని నిందిస్తారు అని భయపడతాడు. ఇంతకీ ఆ డెడ్ బాడీ ఎవరిది. యువ దీని నుండీ ఎలా బయట పడ్డాడు అనేది మిగిలిన కథాంశం.

నటీనటుల పనితీరు: యువ పాత్రలో కార్తీక్ ఆనంద్ మంచి నటన కనపరిచాడు. మెకానికల్ బ్రాంచ్ స్టూడెంట్ లు అమ్మాయిలు లేక ఎలా ఫ్రస్ట్రేట్ అవుతారో యువ పాత్రలో కనిపిస్తుంది. అలాగే కొన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రను ఎంతో ఈజ్ తో పోషించాడు. అతని మేక్ ఓవర్ కూడా బాగుంది. ఇక హీరోయిన్ ‘గద్దలకొండ గణేష్’ ఫేమ్ డింపుల్ హయతి ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది కానీ ఎక్కువ ప్రాధాన్యత.. హీరో ఫ్రెండ్ రోల్ చేసిన షాలినికే దక్కింది. ఆమె కూడా తన పాత్రకి న్యాయం చేసింది. ఇక ‘బిగ్ బాస్3’ మహేష్ విట్టా కామెడీ ఓకే అనిపించగా.. బ్రహ్మాజీ కామెడీ మాత్రం హైలెట్ అనిపిస్తుంది. మరో హీరో మున్నా పాత్ర సో సోగా ఉన్నప్పటికీ.. సెకండ్ హాఫ్ మొత్తం ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుంటుంది. ఇక అభయ్ బేతిగంటి తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు.

సాంకేతిక వర్గం పనితీరు: హీరో కమ్ దర్శకుడిగా రెండు బాధ్యతల్ని తన మీదే వేసుకుని నడిపించిన కార్తీక్ ఆనంద్ కు ఎక్కువ మార్కులు దక్కుతాయి. అతను రాసుకున్న స్క్రిప్ట్ ను.. అంతే ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా విసిగించే సీన్లు ఉన్నప్పటికీ.. ఎంతో ఇంటెలిజెంట్ గా ఇంటర్వెల్ దగ్గర సస్పెన్సు కు తెరలేపాడు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఎంతో ఎంగేజింగ్ గా అలాగే గ్రిప్పింగ్ గా నడిపించాడు. నరేష్ కుమారన్ అందించిన సంగీతం అలాగే నేపధ్య సంగీతం బాగుంది. ‘ఏం జరిగే’ పాట వినడానికి బాగుంది కానీ విజువల్ గా అంత ఆకట్టుకునేలా లేదు. విశ్వకాంత్ సినిమాటోగ్రఫీ హైలెట్ అని చెప్పాలి. ఆఫీస్ రూమ్ వాతావరణం…. అలాగే ‘కాలేజ్ ఫెస్ట్’ నిజంగానే జరుగుతుందా అనేంత వాస్తవికంగా చిత్రీకరించాడు. నిర్మాతలు అనవసరమైన ఖర్చులు పెట్టకుండా.. సినిమా కథకు తగినట్టు ఖర్చు చేసినట్టు క్లియర్ గా స్పష్టమవుతుంది.

విశ్లేషణ: ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా మొదలైనప్పటికీ.. ప్రీ ఇంటర్వెల్ నుండీ ఊపందుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం సస్పెన్సు ఎలిమెంట్స్ తో ఎంతో ఎంగేజింగ్ గా సాగుతుంది. కొన్ని లాజిక్ లను పక్కన పెట్టేస్తే… బ్రహ్మాజీ కామెడీ మరియు సెకండ్ హాఫ్ కోసం నిస్సందేహంగా ఈ చిత్రాన్ని చూడొచ్చు. రన్ టైం కూడా 2 గంటల 2 నిమిషాలే కావడం ఈ చిత్రానికి మేజర్ ప్లస్ పాయింట్.

రేటింగ్: 3/5

Click Here To Read In English

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus