ఇప్పుడు ఎక్కడ విన్నా అందరినోటా ఒకేమాట.. ‘కాంతార’.. ఇది సామాన్యమైన సినిమా కాదు. ఇది కర్ణాటకలోని కరావళి ప్రాంతపు ప్రాచీన కళారూపాలకు, సంస్కృతికి, జీవన విధానానికి వెండితెరపై జరిగిన అభిషేకం.. సినిమాను ఇష్టపడే వారికి ‘కాంతార’ను థియేటర్లలో చూడడం సరికొత్త అనుభూతినిస్తుంది.. సినిమా చూసిన వారికి అసలు ఇది నిజంగా జరిగిన కథేనా? సినిమాలో చూపించినట్టు అక్కడి ప్రజలు ఆత్మలతో మాట్లాడతారా? అసలు సినిమాలో చూపించిన నృత్యానికి, దేవుడికీ సంబంధం ఏంటి? మనిషిలోకి దేవుడు రావడం, తర్వాత ఆ మనిషి మాయమవ్వడం ఏంటి?.. ఇలా ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి వాటికి సమాధానాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
‘కాంతార’లో చూపించిన కళారూపం ‘భూత కోల’. ఇది కూడా మన ప్రాచీన కళారూపాల వంటిదే. కర్ణాటకలోనూ, ఉత్తర కేరళలోనూ సముద్రతీరంలో విస్తరించిన కరావళి ప్రాంతం, దానికి పక్కనే అటవీ ప్రాంతాలైన మలెనాడు ప్రాంతాలకు చెందిన కళారూపం ఇది.
మనకూ గ్రామదేవతలు ఉన్న తీరుగానే వారికీ దేవతలున్నారు. జుమాది, బ్రహ్మేరు, కొడమనితయా, లెక్కెసిరి, పంజుర్లి, కుప్పె పంజుర్లి, రక్త పంజుర్లి, ఉరండరయ్య, హోసదేవత.. ఇలా ఎందరెందరో ఉన్నారు. ఈ దేవతలకు పురాణాలున్నాయి. ఉత్సవాలు జరిగేప్పుడు భూతకోల కట్టి ఆ కథలు చెప్తారు.
‘కాంతార’ సినిమా కథ ఈ భూతకోల సంప్రదాయంతోనూ, అడవులను నమ్ముకుని జీవిస్తున్న ప్రజల జీవన విధానంలోనూ వేళ్ళుదన్ని ఎదిగింది. కొల్లూరు అడవులకు ఆనుకుని, కుందాపుర నుంచి విసిరేసినట్టు కరావళికి-మలెనాడుకు మధ్య ఉండే గ్రామం- కేరడి. ఇక్కడి వాడైన రిషభ్ శెట్టి ఈ ప్రాంతపు రక్తమాంసాలతో సినిమా తీశాడు.
సినిమా అంతా అడవిపంది/వరాహం రిఫరెన్సు వస్తూనే ఉంటుంది. భూమిని కాపాడడానికి అడవి బిడ్డల పోరాటానికి, భూమిని రాక్షసుని బారి నుంచి కాపాడిన ఆదివరాహాన్ని సంకేతంగా తీసుకున్నాడని సినిమా చూసినప్పుడు తోస్తుంది.
కానీ, పంజుర్లి అన్న దైవం/భూత వరాహ ముఖంతో, స్త్రీ శరీరంతో ఉండే దైవమనీ, ఆమెను ఆరాధించే భూతకోలలో వరాహ ముఖం ఉపయోగించడం సర్వసాధారాణమనీ తెలిశాకానే రిషభ్ శెట్టి సృష్టి అసామాన్యమని అర్థమవుతుంది. సినిమాలో పంజుర్లి పూనిన మనిషి మాయమైపోవడం, అడవి పంది అలంకారాలతో కనిపించడం, ఒక ప్రదేశం చుట్టూ గుండ్రంగా అగ్గిపుట్టడం వంటి అనేక అంశాలను ఉపయోగించారు.
మన ఊళ్ళల్లో అమ్మవారి ఊరేగింపులో మహిళలకు ఉన్నట్టుండి మహిళలను అమ్మవారు ఆవహిస్తుంటుంది.. ఆ టైములో ఆ మహిళ అసామాన్యంగా ప్రవర్తిస్తూ ఉంటుంది.. అవలీలగా బిందెడు పసుపు నీళ్లు తాగడం, ఊళ్ళో జరగబోయే అనర్ధాలు, వాటి పరిష్కార మార్గాలు చెప్పడం వంటివి చూస్తుంటాం.. హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగే లష్కర్ బోనాల గురించి, అప్పుడు వినిపించే భవిష్యవాణి గురించి, అది నిజమని నిరూపితమైన సందర్భాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు..
వాస్తవానికి ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగే, జరుగుతున్న అద్భుతాలే.. కానీ, మనలోని శాస్త్రీయ కోణం ఆ నిజాలను ఒప్పుకోనివ్వదు. అయితే.. ఈ జాతరలో వచ్చే పూనకాలను, బోనాల సమయంలో చెప్పే భవిష్యవాణిని కనీసం మన సంస్కృతి, సాంప్రదాయంగా ఎందుకు చూడలేకపోతున్నాం? సంస్కృతి, సాంప్రదాయాలు అంటే.. నిజాలు, అబద్ధాలు కాదు. మనం పెరిగిన జీవిన విధానం. ఇదే పాయింట్ ని రిషబ్ శెట్టి తన కథా వస్తువుగా మార్చుకున్నాడు. తమ పూర్వీకుల నమ్మకాలను ‘కాంతార’ కథకి ముడి సరుకుగా మార్చుకున్నాడు.
తమ సంస్కృతీ, సాంప్రదాయాలను కాపాడుకోవడానికి రిషబ్ శెట్టి సినిమాటిక్ లిబర్టీ తీసుకుని చేసిన గొప్ప ప్రయత్నమే ఈ ‘కాంతార’.. సినిమాలో చూపించినట్టు కొలం కట్టిన మనిషి మాయమవ్వడం అనేది నిజం కాదట. రిషబ్ సొంత ఊరిలో దాదాపు మూడు దశాబ్దాల క్రితం కొన్ని సంఘటనలు జరిగాయట. అక్కడ కొలం కట్టిన వ్యక్తి చెప్పినట్టే కొంతమంది వ్యక్తులు అకాల మారం చెందారట.. వాటి ఆధారంగానే తాను ఈ కథ రాసుకున్నాడు..
ఒకరకంగా ‘కాంతార’ కథ మనకి తెలియనిది కాదు.. అబద్ధం అంతకన్నా కాదు.. నిజమే.. మన గ్రామాల్లో సోది చెప్పే వాళ్ళలోకి ఆ టైములో మన పూర్వీకులు వస్తుంటారని విషయం తెలిసిందే.. ఒక్కోసారి మన కులదైవం కూడా వస్తుంది. మనం పోగొట్టుకున్న వస్తువు ఏ దిక్కున ఉందొ కూడా చెప్తుంది. ‘కాంతర’ లో చూపించింది కూడా ఇదే కదా.. అందుకే ‘కాంతార’ మనకి తెలిసిన కథే.. నిజమైన కథే.. మనం మన సంస్కృతీ, సాంప్రదాయాలను పట్టించుకోవడం లేదు.. కన్నడ వాళ్ళు వాటికి పెద్ద పీట వేస్తున్నారు అదే తేడా..
Most Recommended Video
ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!