ఫ్యాన్స్ ముసుగులో కొంతమంది చేస్తున్న నిర్వాకం వల్ల హీరోయిన్లు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. మొన్నీమధ్య ‘ది రాజా సాబ్’ ఈవెంట్‌కి వచ్చిన నిధి అగర్వాల్‌ను ప్రభాస్ అభిమానుల ముసుగులో ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. ఆమెను చుట్టుముట్టి ఎటూ కదలకుండా చేశారు. ఆ విషయం ఇంకా మరచిపోక ముందే ఇప్పుడు మరో హీరోయిన్ అలాంటి ఇబ్బందే పడింది. ఓ షోరూమ్ ఓపెనింగ్‌కి వెళ్లిన సమంతను అక్కడికొచ్చిన ఆమె అభిమానుల ముసుగులో కొంతమంది ఇబ్బంది పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరీ నిధి అగర్వాల్ అంత ఇబ్బంది పెట్టకపోయినా.. ఆమె చీర కొంగు తొక్కేసి, మీదకు వచ్చేశారు అక్కడికొచ్చిన ‘ఫ్యాన్స్’. దీంతో ఆమె వ్యక్తిగత బృందం, షోరూమ్ వాళ్లు ఏర్పాటు చేసుకున్న సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అతి కష్టం మీద కారులో ఎక్కించి అక్కడి నుండి పంపించేశారు. ఈసారి సమంత ఫేస్ వీడియోలో కనిపించలేదు కానీ.. ఆమె కూడా కారు ఎక్కాక చాలా ఇబ్బంది పడ్డారని సమాచారం. చీర కొంగును కాలితో ఎవరో తొక్కినప్పుడే ఆమె ముఖంలో ఇబ్బంది కనిపించింది.

హైదరాబాద్‌లోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు సమంతకు ఈ పరిస్థితి ఎదురైంది. దర్శకనిర్మాత రాజ్ నిడిమోరును ఇటీవల సమంత రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. దీంతో ఆమె వస్తున్న సమాచారం తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు, ప్రేక్షకులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఆమెతో సెల్ఫీలకు ప్రయత్నించి.. మీద పడబోయారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఇక హీరోయిన్లు బయటకు రావాలంటే ఇబ్బందిపడే పరిస్థితి వస్తుంది.
సమంత సినిమాల సంగతి చూస్తే.. ‘శుభం’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమాలో చిన్న పాత్రనే వేసింది. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ సినిమాతో తెలుగులోకి ‘హీరో’యిన్‌గా రీఎంట్రీ ఇస్తోంది. నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా నాయికా ప్రాధాన్య చిత్రం.
