మా అభిమానం కేవలం హీరోయిన్ల మీదే కాదు.. హీరోల మీద కూడా ఉంటుంది అని చెప్పదలిచారో.. లేక అభిమానం ఉప్పొంగిందో కానీ.. కొంతమంది అభిమానులు ఇద్దరు నటుల మీద ఎక్కువగా చూపించేశారు. దీంతో మరోసారి ‘ఇలా తయారయ్యేంట్రా బాబూ..’ అని అనాల్సి వస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లను చుట్టుముట్టిన ఫ్యాన్స్.. ఇప్పుడు ఇద్దరు హీరోలను/ నటులను ఇబ్బంది పెట్టేశారు. ఒకరు భారీ ఈవెంట్ పెట్టి సినిమాలకు బ్రేక్ ఇచ్చి పొలిటీషియన్ అయిపోయిన విజయ్ దళపతి కాగా.. ఇంకొకరు తెలుగులో కూడా పరిచయం ఉన్న బాలీవుడ్ నటుడు హర్షవర్ధన్ రాణె.
కోలీవుడ్ అగ్ర కథానాయకుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ మలేసియా నుండి ఇండియా వచ్చేశారు. ఆదివారం రాత్రి ఆయన చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. ఈ క్రమంలో అభిమానుల అత్యుత్సాహంతో ఇబ్బంది పడ్డారు. మలేసియాలో జరిగిన ‘జన నాయగన్’ సినిమా ఆడియో లాంఛ్ తర్వాత ఇచ్చిన ఆయనకు ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. విజయ్ కారు వద్దకు వెళ్తుండగా ఒక్కసారిగా ఫ్యాన్స్ ముందుకు రావడంతో ఆయన కిందపడ్డారు. పోలీసులు వారిని కంట్రోల్ చేసినప్పటికీ వారు ఆగలేదు. దీంతో విజయ్ పక్కనే ఉన్న సిబ్బంది సురక్షితంగా కారు ఎక్కించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఇదిలా ఉండగా.. తన కొత్త సినిమా ప్రచారం కోసం బయటకు వచ్చిన బాలీవుడ్ నటుడు హర్షవర్ధన్ రాణెను అభిమానులు చుట్టుముట్టారు. ‘ఏక్ దీవానే కి దీవానియత్’ అనే సినిమా ప్రమోషన్లలో భాగంగా అభిమానులు చుట్టుముట్టారు. అంతేకాదు లాగి, పీకి చొక్కా చింపేశారు కూడా. బాంద్రాలోని బస్టాండ్‌లో సినిమా ప్రచారం చేస్తున్నప్పుడు ఇదంతా జరిగింది. హర్షవర్ధన్ కారు నుండి దిగగానే అభిమానులు చుట్టుముట్టి చొక్కా లాగడం ప్రారంభించారు.
దీంతో అభిమానుల తీరుపట్ల మరోసారి విమర్శలు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా బహిరంగ ఈవెంట్లలో ఫ్యాన్స్ అత్యుత్సాహం స్టార్లను ఇబ్బంది పెడుతూనే ఉంది. ‘ది రాజా సాబ్’ ఈవెంట్‌కి వచ్చిన నిధి అగర్వాల్‌ని ఇలానే ఇబ్బందిపెట్టారు. ఆ తర్వాత ఓ షాప్ ప్రారంభోత్సవానికి వచ్చిన సమంత కూడా ఇలానే ఇబ్బందిపడింది. ఇప్పుడు హీరోల వంతు వచ్చింది.