ఓ మూడ్రోజుల క్రితం ఓ ప్రముఖ న్యూస్ చానల్ లో ఒక ఇన్పుట్ ఎడిటర్ స్థాయి వ్యక్తి “మీ ఇండస్ట్రీలో లం** ముండలు లేరా..?” అని ఒక పోలిటికల్ లైవ్ డిబేట్ లో ఒక సినిమా ఆర్టిస్ట్ ని ప్రశ్నించాడు. అంతే కాక ముందు మీ ఇండస్ట్రీలో ఉన్న చెత్తను ప్రక్షాళణ చేసుకొని తర్వాత రాజకీయాల్లోకి రండి అంటూ హితబోధ కూడా చేశాడు. ఈ విషయమై ఇండస్ట్రీకి చెందిన కొందరు నానా హడావుడి చేశారు. కేసులు వేశారు, ఫేస్ బుక్ లో ట్విట్టర్ లో నానా యాగీ చేశారు. సరే ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్లందర్నీ జనరలైజ్ చేసి అంటున్నందుకు సీరియస్ అయ్యారు బాగానే ఉంది. కానీ.. ఒక్కరైనా ఆ విధంగా అనే స్థాయిలో అతనికి అలుసు ఎవరిచ్చారో ఆలోచించారా? పోనీ సదరు న్యూస్ చానల్ ఇండస్ట్రీ గురించి చెడుగా మాట్లాడిందని ఆ న్యూస్ చానల్ కి యాడ్స్ ఇవ్వడం మానేశారా, లేక ఫిలిమ్ కంటెంట్ ఇవ్వడం మానేశారా? లేదు కదా.
ఇంకా చెప్పాలంటే సదరు టీవి చానల్ “ఎల్.ఎల్.పి” లిస్ట్ లో ఉంది. అందువల్ల ప్రతి సినిమాకి సంబంధించిన లైవ్, ఇంటర్వ్యూలు, ఆడియో లేదా ప్రీరిలీజ్ ఈవెంట్ ఫీడ్ ఇవ్వాల్సిందే. మరి కేసు వేయడానికంటే ముందు ఆ ఎల్.ఎల్.పి అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేయోచ్చు కదా. చేయరు, చేయలేరు కూడా. ఎందుకంటే రేపన్న రోజున మళ్ళీ అదే చానల్ లో కూర్చుని తమ సినిమాలు పబ్లిసిటీ చేసుకోవాలి కదా. అసలు సదరు వ్యక్తికి ఇండస్ట్రీలో ఆడవాళ్ళు మాత్రమే కాదు అసలు ఇండస్ట్రీ అంటే అంత చులకనభావన ఎందుకు కలిగింది. అందుకు కారణం ఎవరు? అని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకొంటే.. అందుకు కారణం మన ఇండస్ట్రీలో బ్రతుకుతున్నవారేనన్న విషయం స్పష్టమవుతోంది.
మాధవీలత, అర్చన, గాయత్రి గుప్తా, శ్రీరెడ్డిలు యూట్యూబ్ చానల్స్, టీవీ చానల్స్ కి స్వయంగా వెళ్ళి మరీ “మమ్మల్ని అంత మంది వాడుకోవాలని చూశారు, ఇంతమంది చేతులు వేశారు, వాళ్ళు అలా తాకేవారు, వీళ్ళని నేను కొట్టాను” అంటూ అవాకులు చావాకులు పేలడం ఆ వార్తలు దాదాపుగా అన్నీ చానల్స్ లో ట్రెండ్ అవ్వడం అనేది గత కొంత కాలంగా జరుగుతూనే ఉంది. అయితే.. “గాయత్రి గుప్తా, శ్రీరెడ్డి”లు మరీ దారుణంగా లైవ్ చానల్ లో బూతులు మాట్లాడుతూ అదేదో సోషల్ స్టేటస్ అన్నట్లుగా వ్యవహరించడం అందరినీ షాక్ కి గురి చేసింది.
ఇలా వరుసబెట్టి కొందరు ఇండస్ట్రీ గురించి బ్యాడ్ ప్రోపగాండా చేశారు. వీళ్ళ ఇంటర్వ్యూల వల్ల ఇండస్ట్రీ గురించి జనాల్లో నెగిటివిటీ పెరిగిపోయింది. అలా వాళ్ళూ వీళ్లూ అనుకోవడం పుణ్యమా అని అందరికీ ఇండస్ట్రీ అంటే చీప్ అయిపోయింది. అలాగని ఇండస్ట్రీలో చెడు జరగడం లేదని కాదు, జరుగుతోంది. అయితే.. దానివల్ల అందరూ ఎఫెక్ట్ అవ్వడం లేదు. చిత్రసీమలో మాత్రమే కాదు ప్రతి ఇండస్ట్రీలోనూ గుడ్/బ్యాడ్ ఉంటుంది. దాన్ని ఎవరికి వారే సెల్ఫ్ ఎసెస్ మెంట్ చేసుకోవాలి. అంతే కానీ అనవసరంగా కడుపు చించుకొంటే కాళ్ళ మీద పడినట్లు ఈ విధంగా రచ్చ చేసుకుంటూ వెళితే పోయేది మన పరువే.