సినీ పరిశ్రమలో మనకు కనిపించే గ్లామర్ తళుకుల వెనుక నిర్మాతలు చెప్పుకోలేని ఆర్ధిక సంక్షోభం దాగి ఉంది అనటానికి ప్రత్యక్ష నిదర్శనం రీసెంట్ గా బాలయ్య నటించిన అఖండ 2 చిత్రం రిలీజ్ వాయిదా. ఇటీవల నెలకొన్న ఈ సంఘటనల ద్వారా పాత బాకీలు & వాటి వడ్డీలకు సంబందించిన వివాదం ఈ సమస్య యొక్క తీవ్రత ఎంత పెద్దదో తెలియజేస్తుంది. ఇంతకు ముందు ఎగ్జిబిటర్లు ఇచ్చే అడ్వాన్సులతో సినిమాలు ప్రొడ్యూస్ చేసేవారు నిర్మాతలు. కానీ ప్రస్తుతం అలాంటి విధానాలు, వ్యవస్థ లేనే లేవు.
ముందుగా థియేటర్ల నుంచి అడ్వాన్సులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ప్రొడ్యూసర్లు ప్రైవేట్ ఫైనాన్షియర్లపై ఆధారపడుతున్నారు. స్టార్ హీరోల రెమ్యునరేషన్లు భారీగా పెంచేయటంతో సినిమా మొత్తం బడ్జెట్‌లో సింహభాగం హీరోల రెమ్యూనరేషన్ కే వెళ్తుంది అనేది చేదు వాస్తవం. ఇతరత్రా ఖర్చుల కోసం నిర్మాతలు అధిక వడ్డీలకు రుణాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఒక సినిమా నష్టపోతే, తదుపరి సినిమాల అడ్వాన్సులతో పాత అప్పులు తీరుస్తున్న దుస్థితిలో నిర్మాతలు సతమతమవుతున్నారు.
ఇది ఇలా ఉండగా ప్రైవేట్ కార్పొరేట్ లెండర్లు తాము ఇచ్చిన భాకీల కోసం కోర్టు మెట్లు ఎక్కి రిలీజ్ అయ్యే కొత్త చిత్రాలకు అడ్డుపడటం షరా మాములే అన్నట్లుగా మారిపోయింది. మల్టీప్లెక్స్ సిస్టమ్ కారణంగా నిర్మాతలకు తమకు రావాల్సిన డబ్బులు సమయానికి అందుకోలేకపోతున్నారు. కాగా ఇదే సమయంలో వడ్డీ మాత్రం ఆగకుండా పెరుగుతూ పోతుంది. మరోవైపు ఓటీటీ, శాటిలైట్ మార్కెట్ కూడా పడిపోయి నాన్–థియేట్రికల్ రెవెన్యూ చాలా వరకు తగ్గిపోయింది.
ఈ ఒత్తిడులన్నింటి మధ్య ఎక్కువగా నలిగిపోతున్నది చివరికి నిర్మాతే. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే మూవీ బడ్జెట్‌ను మార్కెట్ స్థాయికి తగ్గట్టు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయడం, ఖర్చులను కట్టుదిట్టంగా నియంత్రించడం తప్పనిసరి. ఇవి అమలు కాకపోతే ఒకటి రెండు కాదు… ఇంకా చాలానే సినిమాలు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది.