అక్కినేని వారసుడు అఖిల్ (Akhil Akkineni) కొత్త సినిమా ఎప్పుడు అంటూ అభిమానులు సుమారు రెండేళ్లుగా వెయిట్ చేస్తున్నారు. అనేక అడ్డంకులు తర్వాత ఎన్నో అంచనాలతో విడుదలైన ‘ఏజెంట్’ (Agent) సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో అఖిల్ మొత్తం ప్లానింగ్‌ను రీథింక్ చేసుకున్నాడు. ఆ సినిమా షురూ, ఈ సినిమా షురూ అంటూ కొన్ని సినిమాల పేర్లు వినిపించినా.. ఫైనల్లీ ఓ పోరాట యోధుడి సినిమాను ఓకే చేశాడు. అంతేకాదు సినిమా షూటింగ్ కూడా మొదలైంది అంటున్నారు.
‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) అనే సినిమా తెరకెక్కించి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ కొత్త సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా శ్రీలీల (Sreeleela) ఎంపికయ్యింది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘లెనిన్’ అనే పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. ఆదివారం అన్నపూర్ణ స్టూడియోస్ సినిమాకు క్లాప్ కూడా కొట్టారు అని సమాచారం. కొన్ని రోజుల తర్వాత సినిమా ఫస్ట్‌లుక్‌తో అనౌన్స్ చేస్తారట.
ఇక సినిమాకు ‘లెనిన్’ అనే పేరు పెట్టడంతో ఓ పోరాట యోధుడి కథను మనకు చెప్పబోతున్నారు అని అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ చరిత్రతో పరిచయం ఉన్నవాళ్లెవరైనా లెనిన్‌ని మర్చిపోరు. అక్టోబరు విప్లవానికి నాంది పలికిన నాయకుడు ఆయన. ఇప్పుడు అఖిల్ సినిమాకు ఆ పేరు పెట్టారు అంటే.. కచ్చితంగా ఏదో విషయమే ఉంటుంది. అయితే అందులో మంచి ప్రేమ కథ కూడా ఉంటుంది అని చెబుతున్నారు. ప్రేమ విప్లవం, ప్రేమలో కమ్యునిజం లాంటి అంశాలను సినిమాలో టచ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
తమన్ (S.S.Thaman) సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో శ్రీలీలతోపాటు మరో హీరోయిన్ కూడా ఉంటుంది అని చెబుతున్నారు. త్వరలో ఈ విషయంలో క్లారిటీ రావొచ్చు. ఈ సినిమా మొదలవ్వడంతో యూవీ క్రియేషన్స్‌లో ఉంటుంది అని చెప్పిన అఖిల్ సినిమా అనౌన్స్‌మెంట్ కూడా త్వరలో రావొచ్చు అని అంటున్నారు. 80ల కాలం నాటి రాయలసీమ నేపథ్యంలో ఆ సినిమా ఉంటుందని టాక్.