బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) సల్మాన్ ఖాన్ సోదరులను క్వారంటైన్ లోకి తరలించింది. నటుడు-నిర్మాత సోహైల్ ఖాన్, అతని కుమారుడు నిర్వాన్ ఖాన్, సోదరుడు అర్బాజ్ ఖాన్లను ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్‌లో క్వారంటైన్ లో ఉంచారు. ఈ ముగ్గురూ డిసెంబర్ 25 న దుబాయ్ నుండి తిరిగి వచ్చారు. అయితే ఒక హోటల్‌లో నిర్బంధంలో ఉండమని కోరినప్పటికీ వినలేదని ఒక వైద్య అధికారి FIR నమోదు చేశారు.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం, యుకె, యుఎఇ, యూరప్ వంటి దేశాల నుంచి తిరిగి వచ్చినవారు ఏడు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందే. ఇక UK నుండి కొత్త కరోనావైరస్ నివేదించబడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను అమలు చేసింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొత్త కోవిడ్-19 జాతి ఇతర SARS-CoV-2 వేరియంట్ల కంటే ఎక్కువ ప్రభావం చూపగలవు. అందుకే నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.
ఇక సోమవారంనాడు సల్మాన్ సోదరులపై ఎపిడిమిక్ డిసీజెస్ యాక్ట్ 3 కింద సెక్షన్ 188 ఐపిసి కింద ఫిర్యాదు చేయడం జరిగింది. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) వైద్య అధికారి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఖార్ పోలీస్ స్టేషన్లో ఆ ఎఫ్ఐఆర్ దాఖలైనట్లు సమాచారం.