తెలుగు చిత్రసీమలో విలనిజం విరాజిల్లుతోంది

హీరోలుగా పేరు తెచ్చుకున్నవారు విలన్‌ పాత్రలు చేయడానికి అంత సులువుగా అంగీకరించరని అంటారు. తమకు ఉన్న ఇమేజ్‌ ఎక్కడ పడిపోతుందన్న ఉద్దేశ్యం చాలామంది నటులలో ఉంటుంది కూడా. అయితే కొంతమంది నటులు మాత్రం దీనికి భిన్నంగా ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోవాలని కోరుకుంటుంటారు. పాత్ర తమకు అన్నివిధాల నచ్చాలే కానీ హీరో పాత్రలే కాదు విలన్‌ పాత్రలకు సై అనే నటులు లేకపోలేదు.

ఇమేజ్‌ సూత్రాలను పక్కనపెట్టి మరీ విలన్‌ పాత్రలను చేసేందుకు ముందుకు వస్తున్నారు. అంతేకాదు తాము నటించే విలన్‌ పాత్ర బాడీలాంగ్వేజ్‌ కోసం ఎంతగానో కష్టపడుతున్నారు కూడా. హీరో పాత్రలు చేసేందుకు అవసరాన్ని బట్టి పాత్ర డిమాండ్‌ మేరకు బాడీలాంగ్వేజ్‌ కోసం ఎంత కష్టపడు తున్నారో విలన్‌ పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసేందుకు అంతే కష్టపడుతున్నారు. ప్రేక్షకులు తమను కాకుండా తమ పాత్రలను మాత్రమే చూసేలా అద్భుతమైన అభినయాన్ని కనబరిచేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ కోవలో తెలుగు, తమిళ, హిందీ సినీరంగాలలో ఎందరో నటుల ను ఉదహరించవచ్చు. తెలుగు నటుడు రానా విషయానికే వస్తే ఓ వైపు హీరోగా నటిస్తూనే విలన్‌ పాత్ర నచ్చితే నటించేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఈ తరహాలో విలన్‌గా ఆయన నటించిన బాహుబలి రెండు సిరీస్‌ చిత్రాలు ఎంతటి ఘన విజయం సాధించాయో తెలియం ది కాదు. ఇందులోని పాత్రల కోసం రెండుసార్లుగా ఆయన తన బాడీలాంగ్వేజ్‌ను మార్చుకున్నారు. పాత్రకు తగ్గ ఆహార్యంలో ఒదిగిపోయారు. విలన్‌ పాత్రలో కావాల్సిన క్రౌర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. అలాగే కన్నడ నటుడు సుదీప్‌ కూడా కన్నడంలో హీరోగా నటిస్తూనే విలన్‌ పాత్రలు చేసేందుకు సంసిద్దతను వ్యక్తంచేస్తున్నారు.

నాని కథానాయకుడిగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈగ చిత్రం ఎంత సూపర్‌డూపర్‌ హిట్టయ్యిందో తెలిసిందే. ఈ చిత్రంలో విలన్‌గా సుదీప్‌ నటనకు సర్వత్రా అభినందనలు లభించాయి. ఆ పాత్రకు ఆయన ప్రాణప్రతిష్ట చేసిన తీరు హర్షణీయం. ఇక అదే ఫార్ములాను మరో కన్నడ నటుడు ఉపేంద్ర కూడా అనుసరిస్తున్నారు. కన్నడంలో హీరోగా మంచి గుర్తింపు ఉన్న ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆయన నటించిన కొన్ని చిత్రాలు తెలుగులోకి అనువాద కావడంతో పాటు కన్యాదానం వంటి తెలుగు చిత్రాలలో ఆయన నేరుగా నటించారు. అలా హీరోగా ఆయన్ని చూసిన ప్రేక్షకులకు సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రంలో కరుడుగట్టిన విలన్‌గా కనిపించారు. అందులో విలన్‌ పాత్రలో ఆయన నటించిన విధానం హైలైట్‌గా నిలిచింది. పాత్రకు తగ్గ అభినయాన్ని పండించడంలో తన నటనాభువాన్ని చూపారు.

ఇక తెలుగు నటుడు జగపతిబాబు గురించి చెప్పాలంటే.. గతంలో హీరోయిజంలో తన ప్రత్యేకతను చాటిని ఆయన విలనిజానికి కొత్త అర్థం చెబుతున్నారు. ఫలానా పాత్రలే చేస్తానని ఆయన ఇప్పుడు చెప్పడం లేదు. పాత్ర నచ్చితే అది ప్రధాన పాత్ర అయినా విలన్‌ పాత్రయినా లేక ఇంకేదైనా ముఖ్య పాత్ర అయినా సిద్ధం అని అంటున్నారు. లెజెండ్‌ చిత్రం మొదలుకుని ఇప్పటివరకు ఆయన పలు చిత్రాల్లో విలన్‌ పాత్రలలో ఆయన ఒదిగిపోయారు. ఇటీవల వచ్చిన రంగస్థలం కూడా ఆయనకు పేరు తెచ్చిపెట్టింది.

ఒకప్పుడు రోజా, బొంబాయి వంటి చిత్రాలలో హీరోగా నటించిన అరవిందస్వామి చాలాకాలం గ్యాప్‌ తర్వాత సినీరంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలియంది కాదు. ఇందులో భాగంగా విలన్‌ పాత్రలతో పాటు హీరో అనబడే ప్రధాన పాత్రలలో కూడా నటిస్తున్నారు. రీఎంట్రీలో భాగంగా తమిళంలో ఆయన నటించిన తని ఒరువన్‌ చిత్రం అఖండ విజయం సాధించింది. అదే చిత్రాన్ని తెలుగులో రామ్‌చరణ్‌ హీరోగా ధృవ్‌ పేరుతో రీమేక్‌ చేశారు. ఇందులో కూడా తాను పోషించిన విలన్‌ పాత్రనే అరవిందస్వామి పోషించారు. తెలుగులో కూడా ఆయనకు అంతే పేరొచ్చింది. పాత్రలు నచ్చేదాన్ని బట్టి ప్రధాన పాత్రలయినా…విలన్‌ పాత్రలయినా అరవిందస్వామి చేసేందుకు ముందుకు వస్తున్నారు.

మరో తమిళ నటుడు మాధవన్‌ కూడా తెలుగు ప్రేక్షకులకు పలు అనువాద చిత్రాల ద్వారా చాలాబాగా సుపరిచితమే. తెలుగులో ఇటీవల నాగచైతన్య కథానాయకుడిగా రూపొందిన సవ్యసాచి చిత్రంలో మాధవన్‌ విలన్‌ పాత్రలో మెరిసారు. సినిమా ఏ స్థాయిలో ఆడిందన్న విషయాన్ని పక్కనపెడితే మాధవన్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. తన పాత్రలో ఆయన ఒదిగిపోయిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక తమిళంలో పలు చిత్రాలు చేసినప్పటికీ తెnలుగులో కూడా బిజీ కావాలని కోరుకుంటున్న ఆది పినిశెట్టి కూడా ఫలానా పాత్రలే చేయాలని ఎలాంటి నియమం పెట్టుకోలేదట. ఓ వైపు హీరోల పాత్రలు చేసుకుంటూ పోతూనే ఎప్పుడు స్పందింపజేసే విలన్‌ పాత్ర లభిస్తే…అందులో నటించేందుకు ఆయన సై అంటున్నారు. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా రూపొందిన సరైనోడు చిత్రం గతంలో ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఇందులో ప్రతినాయకుడిగా ఆది పినిశెట్టి అద్భుతమైన అభినయాన్ని కనబరిచారు. హీరో పాత్రనే కాదు విలన్‌ పాత్ర నటన గురించి అందరూ చెప్పుకునేలా తన అభినయాన్ని ప్రదర్శించారు.

వీరి సంగతి ఇలా వుంటే…ఇక బాలీవుడ్‌లో ప్రముఖ కథానాయకుడైన అక్షయ్‌కుమార్‌ తన హీరో ఇమేజ్‌ను సైతం పక్కనపెట్టి 2.ఓ. చిత్రంలో విలన్‌గా నటించారు. ఆ పాత్ర కోసం దాదాపు మూడు గంటల సమయాన్ని మేకప్‌కే ఆయన వెచ్చించారట. ఈ పాత్రలో నటించడం గురించి అక్షయ్‌కుమార్‌ మాట్లాడుతూ, తన 28 ఏళ్ల కెరీర్‌ అంతా ఒక ఎత్తయితే విలన్‌ పాత్ర పరంగా ఈ చిత్రంలోని పాత్ర ఒక ఎత్తు అని అంటున్నారు.

మరో హిందీ నటుడు వివేక్‌ ఒబరాయ్‌కి హీరోగా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. తెలుగులో కూడా ఆయన కొన్ని చిత్రాలలో నటించారు కూడా. గతంలో హిందీలో వచ్చిన క్రిష్‌-3 చిత్రంలో విలన్‌గా వివేక్‌ అభినయం హైలైట్‌గా నిలిచింది. ఇక ఈ కోవలోనే నీల్‌నితిన్‌ ముఖేష్‌కు హిందీలో హీరోగా పేరుంది. అయినప్పటికీ విలన్‌గా నటించేందుకు ఆయన ఎంతమాత్రం వెనుకాడటం లేదు. తమిళంలో విజయ్‌ కథానాయకుడిగా రూపొందిన కత్తి చిత్రంలో ఈయనే విలన్‌ పాత్రలో ఒదిగిపోయారు. ఓ వైపు హిందీలో హీరోగా నటిస్తూనే విలన్‌ పాత్రలు అడపాదడపా చేస్తున్న ఆయన తాజాగా తెలుగులో సాహో, కవచం చిత్రాలలో విలన్‌గా తన అభినయాన్ని పలికించబోతున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే.

ఇక తెలుగు నటుడు సుధీర్‌బాబు విషయానికి వస్తే…హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలను చేసుకుంటూ పోతున్న ఆయన రెండేళ్ల క్రితం బాలీవుడ్‌లోకి విలన్‌ పాత్ర ద్వారా ప్రవేశించారు. భాగి అనే హిందీ చిత్రంలో ఆయన చేసిన విలన్‌ పాత్ర పండినప్పటికీ చిత్రం అనుకున్నంతగా ఆడలేదు. దాంతో ఇప్పుడాయన తెలుగు సినిమాలలో హీరోగానే కొనసాగుతున్నారు. ఇలా హీరోలెందరో విలన్‌ పాత్ర తమకు నచ్చితే వాటిని చేసేందుకు ముందుకొస్తూ అభినయంలో తమ సత్తాను చాటుతున్నారు. వీరేకాదు ఇంకొందరు హీరోలు కూడా తగిన విలన్‌ పాత్ర లభిస్తే నటించేందుకు అభ్యంతరం లేదంటున్నారు. ముందు ముందు ఇంకా ఎందరు ఈ కోవలో ముందుకు సాగుతారో వేచిచూడాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus