సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్ సాధించడం తేలికైన పని కాదు, ప్రత్యేకించి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన వారికి. కానీ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) కథ మాత్రం పూర్తి విభిన్నం. చిన్న వయసులోనే తండ్రిని, ఇద్దరు సోదరులను కోల్పోయిన ఈ తెలుగమ్మాయి జీవన పోరాటం ఒక స్ఫూర్తిదాయక కథగా మారింది. కుటుంబ పోషణ కోసం టినేజీలోనే సేల్స్ గర్ల్‌గా పనిచేసిన ఐశ్వర్య, సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించింది. ఐశ్వర్య రాజేష్ తండ్రి రాజేష్ సౌత్ ఇండస్ట్రీలో నటుడిగా, హీరోగా పేరు సంపాదించారు.
అలాగే హాస్య నటి శ్రీలక్ష్మి ఈమెకు అత్తయ్య. కానీ తండ్రి చిన్న వయసులోనే మరణించడంతో ఐశ్వర్య ఊహించని కష్టాలు ఎదుర్కొంది. తన ఇద్దరు సోదరులను రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన ఈమె, కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడానికి సేల్స్ గర్ల్‌గా పనిచేయాల్సి వచ్చింది. ఆ క్రమంలో టీవీ షోలతో తన కెరీర్‌ను ప్రారంభించి, మోడలింగ్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. మెల్లమెల్లగా నటిగా ఆమె అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. ఇక తమిళ చిత్రాలతో హీరోయిన్‌గా బిజీ అయిన ఐశ్వర్య, టాలీవుడ్‌లో మాత్రం మొన్నటి దాకా పెద్దగా అవకాశాలు పొందలేదు.
కానీ ఇటీవల విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) సినిమాతో ఆమె టాలీవుడ్‌లోను ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడంతో ఐశ్వర్య కెరీర్‌లో మరో రికార్డుగా నిలిచింది. ఈ సినిమాలో భాగ్యం పాత్రతో ఆమె నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఐశ్వర్య రాజేష్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు సందర్భాల్లో మాట్లాడుతూ, తన చిన్ననాటి కష్టాలను గుర్తు చేసుకుంది.
కుటుంబానికి ఆర్థికంగా సాయం చేసేందుకు పని చేసిన రోజులను, కష్టపడితే ఎంతటి స్థాయికి చేరుకోవచ్చో తన జీవితం సాక్ష్యమని చెప్పింది. రాంబంటు సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ ప్రారంభించిన ఐశ్వర్య, ఆ తర్వాత టీవీ హోస్ట్‌గా క్రేజ్‌ను సొంతం చేసుకుని హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ సౌత్ సినిమాలతో పాటు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయాలని చూస్తోంది.