తరచూ వివాదాలతో వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనతో కలిసి పని చేసిన ఆర్టిస్ట్ లకు, సినీ కార్మికులకు ఆయన వేతనాలు ఇవ్వకుండా ఎగ్గొట్టారని సమాచారం. దీంతో ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (FWICE) వర్మపై నిషేధం విధించింది. తమ సంస్థకు చెందిన 32 యూనియన్లు ఇకపై వర్మతో పని చేయరని స్పష్టం చేసింది. కరోనా సమయంలో కూడా వర్మ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఆ సినిమాలకు పని చేసిన ఆర్టిస్ట్ లకు, సినీ కార్మికులకు వర్మ జీతాలు చెల్లించలేదట. మొత్తం కలిపి కోటి రూపాయలకు పైగా బాకీ ఉన్నారని సినీ ఎంప్లాయిస్ యూనియన్ వెల్లడించింది. ఆర్టిస్ట్ లకు, కార్మికులకు చెల్లించాల్సిన డబ్బు ఇవ్వాలని వర్మకి లీగల్ నోటీసులు పంపించినా.. ఆయన నుండి ఎలాంటి రియాక్షన్ రాలేదని FWICE అధ్యక్షుడు బీఎన్ తివారీ, ప్రధాన కార్యదర్శి అశోక్ దూబే తెలిపారు. సెప్టెంబర్ 17 నుండి వర్మకి లేఖలు పంపిస్తున్నామని.. కానీ ఆయన ఇంకా స్పందించలేదని చెప్పారు.
వర్మ గోవాలో సినిమా చేస్తున్నాడని తెలిసి అక్కడ ముఖ్యమంత్రికి సైతం లేఖ రాశామని చెప్పారు. డబ్బులు చెల్లించమని ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. ఆయన మాత్రం స్పందించలేదని.. దీంతో భవిష్యత్తులో వర్మతో కలిసి పని చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు ఫెడరేషన్ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం వర్మ హారర్ సినిమా 12’O క్లాక్ ను డైరెక్ట్ చేస్తున్నారు.