మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా ఈ సంక్రాంతికి అంటే జనవరి 10న రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమాకి టాక్ అనుకున్నట్టు రాలేదు. మరోపక్క రిలీజ్ కి ముందు రోజు నుండి విపరీతమైన నెగిటివిటీ ఏర్పడింది. మొదటి షో పడకముందే సోషల్ మీడియాలో ‘డిజాస్టర్ గేమ్ ఛేంజర్’ అంటూ కొంతమంది పనిగట్టుకుని హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఇక సినిమా మరీ దారుణంగా లేకపోయినా.. నెక్స్ట్ లెవెల్లో ట్రోల్ చేశారు.
అంతేకాదు రిలీజ్ అయిన 2,3 గంటలకే హెచ్.డి ప్రింట్ వచ్చేలా పైరసీ చేశారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల నడుమ ‘గేమ్ ఛేంజర్’ నిలబడలేకపోయింది. మరోపక్క సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన మిగిలిన రెండు సినిమాలు మంచి టాక్ తెచ్చుకోవడం వల్ల.. ‘గేమ్ ఛేంజర్’ ని మరింతగా పక్కన పెట్టేశారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమాని థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూడాలని ఆశ పడుతున్నారు.
‘గేమ్ ఛేంజర్’ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. భారీ రేటుకు ప్రైమ్ సంస్థ ‘గేమ్ ఛేంజర్’ ఓటీటీ హక్కులను దక్కించుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 14 నుండి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందట. అంటే థియేటర్లలో రిలీజ్ అయిన 35 రోజుల తర్వాత ‘గేమ్ ఛేంజర్’ ఓటీటీలోకి అందుబాటులోకి రానుందన్న మాట.త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.