గేమ్ ఓవర్

  • June 14, 2019 / 06:01 PM IST

నయనతార ప్రధాన పాత్రలో రూపొందిన “మయూరి” చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “గేమ్ ఓవర్”. తాప్సీ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ట్రైలర్ & పోస్టర్స్ జనాల్ని విశేషంగా ఆకట్టుకొన్నాయి. ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్ మీద రాని డిఫరెంట్ జోనర్ ఫిలిమ్ అని దర్శకనిర్మాతలు ప్రమోట్ చేసిన విధానం కూడా ఒక వర్గం ప్రేక్షకులకు చిత్రాన్ని మరింత దగ్గర చేసింది. మరి సినిమా ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకొందో చూద్దాం..!!

కథ: స్వప్న (తాప్సీ) గేమ్స్ తయారు చేయడం ఆమె వృత్తి. 2017 వరకూ ఆమె జీవితం చాలా సరదాగా సాగిపోతుంటుంది. కానీ.. డిసెంబర్ 31, 2017 ఆమె జీవితంలో చీకటిని నింపుతుంది. ఆ తర్వాత నుంచి ఆమె ఇంటికి మాత్రమే పరిమితమైపోతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ.. కళమ్మ (వినోదిని)తో కలిసి కోకాపేట్ దగ్గర ఒక ఇండిపెండెంట్ బిల్డింగ్ లో నివసిస్తూ ఉంటుంది.

జనవరి 1, 2019కి చాలా రోజుల తర్వాత తన తల్లిదండ్రుల దగ్గరకి వెళ్దామనుకొంటుంది స్వప్న.. కానీ సరిగ్గా డిసెంబర్ 31, 2018 ఆమె జీవితంలో మరో భయంకరమైన సంఘటన ఎదురవుతుంది.

అయితే.. ఒకసారి తన నిస్సహాయత కారణంగా ఫెయిల్ అయిన స్వప్న, రెండోసారి మాత్రం ధైర్యంగా ఎదురు నిలుస్తుంది. ఆ క్రమంలో ఆమె ఎదుర్కొన్న సమస్యలేమిటి? వాటిని ఎలా అధిగమించింది? ఈ క్రమంలో ఆమెకు తోడ్పడిన వాళ్లెవరు? అనేది “గేమ్ ఓవర్” కథాంశం.

నటీనటుల పనితీరు: తాప్సీ ఈ సినిమాకి హీరోనా, హీరోయినా అని చెప్పడం కంటే ప్రాణం అని చెప్పడం కరెక్ట్ గా ఉంటుంది. స్వప్న పాత్రకు తాప్సీ మాత్రమే న్యాయం చేయగలదు అనిపిస్తుంది. ఇండిపెండెంట్ & స్ట్రాంగ్ ఉమెన్ గా ఆమె నటనకు చాలా మంది కనెక్ట్ అవుతారు. అలాగే.. ఆమె క్యారెక్టర్ కు ఉన్న లేయర్స్ కానీ డైమెన్షన్స్ కానీ చాలా కొత్తగా ఉంటాయి. ఆ పాత్రలో ఆమె చూపిన వేరియేషన్స్ ప్రేక్షకుడ్ని సినిమాలో లీనమవ్వడానికి ముఖ్య కారణంగా పేర్కొనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

మరో ముఖ్యపాత్రలో వినోదిని స్టోరీకి మంచి సపోర్ట్ ఇచ్చింది. కథా గమనంలో ఆమె పాత్ర ప్రాముఖ్యత పెరుగుతూ వెళ్ళడం ప్రేక్షకుడ్ని బాగా ఎగ్జైట్ చేస్తుంది. అనీష్ కురువిళ్ల కనిపించేది కాసేపే అయినా.. అతడి స్క్రీన్ ప్రెజన్స్ బాగుంటుంది.

సాంకేతికవర్గం పనితీరు: రోన్ ఈతన్ యోహాన్ నేపధ్య సంగీతం ఈ సినిమాకి ఆయువుపట్టుగా నిలుస్తుంది. 103 నిమిషాల సినిమాలో ఒక్క యాక్షన్ సీన్ కానీ సాంగ్ కానీ ఉండదు. ప్రతి సన్నివేశంలో ఇంటెన్సిటీతోపాటు సెన్సిబిలిటీని కూడా బాగా ఎలివేట్ చేశాడు రోన్ ఈతన్. హారర్ ఫీల్ కలిగిస్తూనే.. థ్రిల్ ను కలిగించాడు ఆడియన్స్ కి.

ఏ.వసంత్ సినిమాటోగ్రఫీ డిఫరెంట్ గా ఉంది. మరీ డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ కానీ ఫ్రేమ్స్ కానీ ట్రై చేయకుండానే కెమెరా వర్క్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాడు. జంప్ స్కేర్ షాట్స్ లా కనిపించే కొన్ని సీక్వెన్స్ లు బాగా తీశాడు. 103 నిమిషాల సినిమాలో దాదాపు గంటన్నర సినిమా సినిమా మొత్తం ఒక ఇంట్లోనే ఉంటుంది. అయితే.. ఎక్కడా కూడా రిపీటెడ్ షాట్స్ కానీ లొకేషన్స్ కానీ కనిపించవు. అదే కెమెరామెన్ గొప్పతనం.

ప్రొడక్షన్ వేల్యూస్ కంటే ప్రొడక్షన్ డిజన్ చాలా బాగుంది. కథకి తగ్గట్లుగా ఆర్ట్ వర్క్ ను డిజన్ చేసిన విధానం ప్రెజంట్ మన ఇండస్ట్రీకి చాలా అవసరం.

దర్శకుడు అశ్విన్ శరవణన్ తాను తీసిన మొదటి సినిమా “మయూరి” (తమిళంలో “మాయ”)తోనే ప్రేక్షకులకి ఒక సరికొత్త సినిమాటిక్ ఫీల్ ను కలిగించాడు. ఇప్పుడు తన మూడో చిత్రమైన “గేమ్ ఓవర్”తోనూ అదే రకమైన ఫీల్ ను కలిగించాడు. ఇది హారర్ సినిమా కాదు, కానీ చిన్న హారర్ ఫీల్ ఉంటుంది. థ్రిల్లర్ కూడా కాదు, కానీ మంచి థ్రిల్ ఉంటుంది. హారర్ & థ్రిల్లర్ కలగలిసిన డిఫరెంట్ జోనర్ సినిమా ఇది. అందుకే మేకర్స్ మొదటి నుంచి ఈ చిత్రాన్ని డిఫరెంట్ జోనర్ సినిమా అని ప్రమోట్ చేశారని సినిమా చూశాక అర్ధమవుతుంది.

కకాపోతే.. రెగ్యులర్ సినిమాల్లా ఆరటి పండు వలిచి నోట్లో పెట్టినట్లుగా ఉండదు సినిమా కథ-కథనం. కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. చాలా ప్రశ్నలకు సమాధానాలు ప్రేక్షకులనే ఆలోచించుకోమని వదిలేశాడు దర్శకుడు అశ్విన్. దాంతో కొందరు ప్రేక్షకులు ఇంతకీ దర్శకుడు ఏం చెప్పదలుచుకొన్నాడు అనేది అర్ధం కాదు. కానీ.. ఫోన్లు పక్కన పెట్టేసి తీక్షణంగా సినిమా చూస్తే మాత్రం చాలా క్లారిటీగా అర్ధమవుతుంది సినిమా. ముఖ్యంగా కమర్షియల్ ఎలిమెంట్స్ కి దూరంగా చాలా రియిలిస్టిక్ గా ఉంటుందీ సినిమా. సినిమా చాలా లాజికల్ గా ఉంటుంది. కాస్త బేసిక్ గేమింగ్ మీద అవగాహన ఉన్న ప్రతి నవతరం ప్రేక్షకుడికి ఈ సినిమా విపరీతంగా నచ్చేస్తుంది.

విశ్లేషణ: బేసిగ్గా ఈ తరహా సినిమాలను మనం హాలీవుడ్ & కొరియన్ లో మాత్రమే చూసి ఉంటాం. “డేజావూ” అనే ఆంగ్ల చిత్ర ఛాయలు కూడా కాస్త గట్టిగానే కనిపిస్తాయి. కానీ.. ఒక కంప్లీట్ డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను కలిగించే చిత్రం “గేమ్ ఓవర్”. నటిగా తాప్సీ స్థాయిని మరో మెట్టు ఎక్కించే సినిమా ఇది.

రేటింగ్: 3/5

CLICK HERE TO READ IN ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus