విశ్వ దేవబత్తుల - శ్రీజిత్ చెరువుపల్లి (Cinematography)
Release Date : జనవరి 24, 2025
సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి నటిగా పరిచయమవుతూ చేసిన సినిమా “గాంధీ తాత చెట్టు”. “మనమంతా, మహానటి, రాధేశ్యామ్” చిత్రాలకు రైటర్ గా వర్క్ చేసిన పద్మావతి మల్లాది దర్శకురాలిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రం టీజర్ లాంచ్ నుండి హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. ఈవారం విడుదలల్లో ప్రేక్షకుల్ని ఎక్కువగా ఆకర్షించిన సినిమా కూడా ఇదే. మరి ఆడియన్స్ అటెన్షన్ ను సక్సెస్ ఫుల్ గా గ్రాబ్ చేసిన ఈ చిత్రం వారిని అలరించగలిగిందో లేదో చూద్దాం..!!
Gandhi Tatha Chettu Review
కథ: గాంధీ మీద విపరీతమైన అభిమానంతో తన మనవరాలు (సుకృతి వేణి బండ్రెడ్డి)కి గాంధీ అని నామకరణం చేస్తాడు రామచంద్రయ్య (ఆనంద చక్రపాణి). గాంధీ భావాలు పుణికిపుచ్చుకుంటుంది మనవరాలు. తాతయ్య చివరి కోరిక అయిన చెట్టును కాపాడడాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటుంది. అందుకోసం ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? గాంధేయవాదాన్ని పాటిస్తూ అహింసతో చెట్టును ఎలా కాపాడుకుంది? అనేది “గాంధీ తాత చెట్టు” కథాంశం.
నటీనటుల పనితీరు: సుకృతి వేణి బండ్రెడ్డిని చూస్తే ఇది ఆమెకు మొదటి సినిమా అని ఎక్కడా అనిపించదు. ముఖ్యంగా ఆమె ఈ సినిమా కోసం గుండు కొట్టించుకోవడం అనేది మెచ్చుకోవాల్సిన విషయం. అక్కడక్కడా చిన్న బెరుకు తప్ప.. అమాయకత్వం, నిజాయితీ కలగలిసిన పల్లె పిల్లగా సుకృతి మంచి మార్కులు సంపాదించుకుంది.
ఆనంద చక్రపాణిని నిన్నమొన్నటివరకు కేవలం సైడ్ క్యారెక్టర్ రోల్స్ లో చూసాం. ఈ సినిమాలో రామయ్య తాతగా మంచి వాల్యూ ఉన్న రోల్ ప్లే చేశారు.
తనికెళ్లభరణి వాయిస్ యాక్టింగ్ తో కీరోల్ ప్లే చేశారు. చెట్టుకి ఆయన డబ్బింగ్ చెప్పడం కథా గమనంలో కీలకపాత్ర పోషించింది. ముఖ్యంగా.. తనను నాటిన రామయ్య ఇకలేడు అంటూ చెట్టు రోధించే సన్నివేశంలో.. సంభాషణ చాలా హృద్యంగా ఉంది.
స్నేహితులుగా నేహాల్ & భానుప్రకాశ్ లు చక్కని హాస్యాన్ని పండించారు. తల్లి పాత్రలో లావణ్య రెడ్డి ఒదిగిపోయింది. చిన్నపాటి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో రాగ్ మయూర్ నటన బాగుంది, ముఖ్యంగా.. క్లైమాక్స్ లో రాగ్ మయూర్ కళ్ళల్లో కనిపించే కృతజ్ఞతా భావం సినిమాకి మంచి జస్టిఫికేషన్ ఇచ్చింది.
మిగతా నటీనటులుగా ఊరి ప్రజలే కావడంతో.. ఎక్కడా అసహజత్వం కనిపించలేదు.
సాంకేతికవర్గం పనితీరు: సంగీత దర్శకుడు రీ గురించి మాట్లాడుకోవాలి. కుర్రాడి పూర్తి పేరు కూడా తెలియదు కానీ.. తెలంగాణా మట్టివాసనను తన సంగీతంతో అందరూ ఆస్వాదించేలా చేశాడు. ముఖ్యంగా కాసర్ల శ్యామ్ రచించిన “ఓలే సందమామ” పాటలో ఆడబిడ్డకు అసలైన అందం అంటే ఏంటి అంటూ వర్ణించిన విధానం బాగుంది.
సినిమాటోగ్రాఫర్లు విశ్వ & శ్రీజిత్ లు వీలైనంత నేచురల్ లైటింగ్ లో సినిమాని తెరకెక్కించడం అనేది సినిమాకి మరింత సహజత్వాన్ని జోడించింది.
ఆర్ట్ డిపార్ట్మెంట్ & ప్రొడక్షన్ డిజైనింగ్ టీమ్ తమకు ఇచ్చిన లిమిటెడ్ బడ్జెట్ తో మంచి అవుట్ పుట్ వచ్చేలా జాగ్రత్తపడ్డారు.
దర్శకురాలు పద్మావతి మల్లాది “గాంధీ తాత చెట్టు”తో ఒక దర్శకురాలిగా కంటే రచయితగా ఎక్కువ మార్కులు సంపాదించుకుంది అని చెప్పాలి. ఆమెలోని రచయిత సినిమాని డామినేట్ చేసింది. ఎందుకంటే.. రాతలో ఉన్న అందం, తెరకెక్కించే విధానంలో కాస్త కొరవడింది. ముఖ్యంగా చెట్టు చరిత్రను చాలా చక్కగా రాసుకున్న ఆమె.. రామయ్య మనవరాలు గాంధీ క్యారెక్టర్ ఆర్క్ ను ఆడియన్స్ అనుభూతి చెందేలా చేయలేకపోయింది. ఈ చిన్నపాటి మైనస్ లను పక్కన పెడితే.. నవతరానికి చక్కని నీతికథను అందించడంలో మాత్రం మంచి విజయం సాధించింది. సినిమాను ముగించిన విధానం కూడా బాగుంది.
విశ్లేషణ: ఈమధ్యకాలంలో చిన్నపిల్లలకు చక్కని నీతికథలా చూపించగలిగే సినిమాలు రావడం లేదు. ఒకప్పుడు కమర్షియల్ సినిమాల్లోనూ చక్కని నీతి ఉండేది. ఉదాహరణకు “కీలుగుర్రం, పాతాళభైరవి” చిత్రాల్లో అందరూ అర్థం చేసుకొని పాటించగలిగే చక్కని నీతి ఉండేది. చాన్నాళ్ల తర్వాత “గాంధీ తాత చెట్టు”లో ఆ నీతికథ కనిపించింది. అయితే.. ఇదే కథను “చిల్లర పార్టీ” (హిందీ సినిమా) తరహాలో చెప్పి ఉంటే ఇంకాస్త ఆకర్షణీయంగా ఉండేది. కానీ. దర్శకురాలు సింపుల్ & స్ట్రెయిట్ గా చెప్పాలనుకునే ప్రయత్నంలో హృద్యంగా అనిపించింది కానీ.. పూర్తిస్థాయిలో ఎంగేజ్ చేయలేకపోయింది.
ఫోకస్ పాయింట్: చిన్నారుల కోణంలో గాంధేయవాదం!
రేటింగ్: 2.5/5
Rating
2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus