Gargi Review: గార్గి సినిమా రివ్యూ & రేటింగ్!

  • July 15, 2022 / 10:28 AM IST

సెన్సేషనల్ సాయిపల్లవి టైటిల్ పాత్రలో నటించిన థ్రిల్లింగ్ డ్రామా “గార్గి”. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అనువాద రూపంలో అదే టైటిల్ తో విడుదల చేశారు. తెలుగులో రాణా సమర్పణలో విడుదలవుతున్న ఈ చిత్రం.. తమిళంలో సూర్య-జ్యోతిక సమర్పిస్తుండడం విశేషం. ఇప్పటివరకూ విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి ఆసక్తిని క్రియేట్ చేసింది. మరి సినిమా సదరు ఆసక్తిని రెట్టింపు చేసిందా? లేదా? అనేది చూద్దాం..!!

కథ: గార్గి (సాయిపల్లవి) ఓ సగటు యువతి. తండ్రి, చెల్లితో కలిసి జీవిస్తూ ఓ లోకల్ స్కూల్లో టీచర్ గా పని చేస్తుంటుంది. చాలా సాధారణమైన జీవితం, చిన్నపాటి ఆనందాలు.. అన్నీ ఒక్క రోజులో మాయమైపోతాయి. కారణం.. గార్గి తండ్రిని పోలీసులు ఓ చైల్డ్ అబ్యుజ్ కేసులో అరెస్ట్ చేయడం.

మంచి సెక్యూరిటీ గార్డ్ గా అందరి మన్ననలు అందుకునే గార్గి తండ్రి ఈ దారుణానికి ఒడిగట్టాడనే విషయాన్ని పోలీసులు తప్ప ఎవరూ నమ్మరు. తన తండ్రి నిజాయితీని ప్రూవ్ చేయడం కోసం గార్గి చేసిన సాహసమే చిత్ర కథాంశం.

నటీనటుల పనితీరు: తెలుగు వరకూ నేటివిటీ మిస్ అయ్యింది కానీ.. గార్గి పాత్రకి సాయిపల్లవి నటిగా 100% న్యాయం చేసింది. ఇప్పటివరకూ సాయిపల్లవి చేసిన సినిమాలన్నీ ఒకెత్తు.. గార్గి ఒకెత్తు. బోలెడన్ని వేరియేషన్స్, విపరీతమైన ఎమోషన్స్ ను చాలా హుందాగా తెరపై పండించింది సాయిపల్లవి. ఈ సినిమాతో ఆమెకు స్టేట్ అవార్డ్ దక్కడం ఖాయం.

ఐశ్వర్య లక్ష్మి, కాళీ వెంకట్ లు సహాయ పాత్రలో అలరించారు. అయితే.. ఐశ్వర్య లక్ష్మి క్యారెక్టరైజేషన్ కు కాస్త క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేది. నత్తి లాయర్ గా కాళీ వెంకట్ పాత్ర ద్వారా క్రియేట్ అయిన సిచ్యుయేషనల్ కామెడీ యాప్ట్ గా ఉంది.

సినిమాలో ప్రధాన పాత్రధారి ఆర్.ఎస్.శివాజీ పాత్రకి ఇచ్చిన బిల్డప్ & ముగింపు సినిమాకి మెయిన్ హైలైట్.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ “గార్గి” ట్రైలర్ ను కట్ చేసి.. ఫాదర్ క్యారెక్టర్ ఎవరు అనేది తెలియకుండా క్యూరియాసిటీ క్రియేట్ చేసిన విధానం బాగుంది. అలాగే.. సహజత్వానికి పెద్ద పీట వేస్తూ క్యారెక్టరైజేషన్స్ ను చాలా సింపుల్ గా, కథనాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దిన విధానం కూడా బాగుంది. అయితే.. పాత్ర తీరుతెన్నులు, కథనం & ముగింపు హిందీ చిత్రం “కహానీ”ని గుర్తు చేస్తాయి.

పూర్తిస్థాయిలో కాకపోయినా.. ఎండింగ్ కి వచ్చేసరికి మాత్రం “ఎక్కడో చూసినట్లుందే ఈ తరహా ఎండింగ్” అనిపిస్తుంది. నిజానికి “గార్గి” క్లైమాక్స్ సినిమాకి ప్రాణం, కానీ.. “కహానీ”ని గుర్తుచేయడమే చిన్నపాటి మైనస్. అలాగే.. చాలా సన్నివేశాల్లో అంతర్లీనంగా పాత్రధారుల వ్యక్తిత్వాన్ని ఎలివేట్ చేసిన విధానం మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటుంది.

సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ & ఆర్ట్ వర్క్ అన్నీ సినిమాకి యాప్ట్ గా ఉన్నాయి.

విశ్లేషణ: సమాజం చూడాల్సిన అతికొద్ది సినిమాల్లో ఒకటిగా “గార్గి” నిలుస్తుంది. సాయిపల్లవి స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్, క్లైమాక్స్ & ఎడిటింగ్ వర్క్ కోసం సినిమాను కచ్చితంగా చూడాల్సిందే.

రేటింగ్: 3/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus