బాలీవుడ్‌లో రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన హిస్టారికల్ ఎపిక్ ఛావా (Chhaava) ఇప్పుడు తెలుగులో కూడా అదే స్థాయిలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. మహారాష్ట్రలో మహా వీరుడిగా గుర్తింపు పొందిన ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ గ్రాండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్, టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక విభిన్న అనుభూతిని అందించబోతుందనే టాక్ ఉంది. ఇప్పటికే ఈ సినిమా హిందీలో 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడంతో, దాన్ని తెలుగులో భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు.
తెలుగులో గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇది బాలీవుడ్ సినిమాకు టాలీవుడ్‌లో లభిస్తున్న అతిపెద్ద థియేట్రికల్ రిలీజ్ అవుతుంది. ఏకంగా 550+ స్క్రీన్లలో విడుదల అవ్వబోతుండటంతో, బాలీవుడ్ మూవీకి ఇంత పెద్ద స్కోప్ రావడం విశేషంగా మారింది. చూస్తుంటే గ్రాండ్ ఓపెనింగ్స్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. గతంలో కొన్ని హిందీ సినిమాలు తెలుగులో డబ్ చేసి మంచి వసూళ్లు సాధించాయి. అయితే, ఛావా మాత్రం విడుదలకు ముందే అంచనాలు పెంచుకుని, రికార్డు స్థాయిలో థియేటర్స్ దక్కించుకోవడం గమనార్హం.
ఈ సినిమా తెలుగులో వస్తోందని తెలియగానే, హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal) ప్రత్యేకంగా వీడియో విడుదల చేసి, తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. “మా సినిమాను మీరు బిగ్ స్క్రీన్ పై ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. మీ ప్రేమే మాకు ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది” అంటూ చెప్పిన విక్కీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే తెలుగు ట్రైలర్ 5 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించి, అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది.
బాలీవుడ్‌లోనే అత్యంత హై బడ్జెట్ హిస్టారికల్ యాక్షన్ మూవీగా నిలిచిన ఈ చిత్రం, టాలీవుడ్‌లో కూడా భారీ వసూళ్లు రాబట్టే అవకాశముందని ట్రేడ్ అనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు చారిత్రక సినిమాల్ని ఎంతగా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఛావా కథ, స్క్రీన్ ప్లే, విజువల్స్ అన్నీ ఒక కొత్త అనుభూతిని అందిస్తాయని ఇప్పటికే హిందీలో చూసిన ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పుడు అదే మ్యాజిక్ టాలీవుడ్‌లో రిపీట్ అవుతుందా? గీతా ఆర్ట్స్ ఎలాంటి ప్రోమోషన్ ప్లాన్ చేస్తుందనేది ఆసక్తిగా మారింది.