Kingston Review in Telugu: కింగ్స్టన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • జివి ప్రకాష్ కుమార్ (Hero)
  • దివ్య భారతి (Heroine)
  • చేతన్, అళగం పెరుమాళ్ తదితరులు.. (Cast)
  • కమల్ ప్రకాష్ (Director)
  • జివి ప్రకాష్ కుమార్ - భవాని శ్రీ - ఉమేష్ కె.ఆర్ భన్సాల్ (Producer)
  • జివి ప్రకాష్ కుమార్ (Music)
  • గోకుల్ బినోయ్ (Cinematography)
  • Release Date : మార్చి 07, 2025

సంగీత దర్శకుడిగా, కథానాయకుడిగా మంచి ఫామ్ లో ఉన్న జివి ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar) హీరోగా నటించి, నిర్మాతగానూ వ్యవహరించిన తాజా చిత్రం “కింగ్స్టన్” (Kingston). ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ మంచి ఆసక్తి రేకెత్తించింది. ముఖ్యంగా “బ్యాచిలర్” అనంతరం జివి ప్రకాష్ – దివ్యభారతి (Divyabharathi) కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!

Kingston Review

కథ: తోవత్తూర్ అనే గ్రామం సముద్రం పక్కనే ఉన్నప్పటికీ.. అక్కడి జాలర్లు ఎవ్వరూ చేపల వేటకి వెళ్లలేక కూలి పనులు చేసుకుంటూ బిక్కుబిక్కుమని బ్రతుకుతుంటారు. చేపల వేటకు వెళ్లినవాళ్లు ఎవరూ ప్రాణాలతో తిరిగిరారు. దానికి కారణం ఏంటి అనేదానికి చాలా పెద్ద కథ ఉంటుంది.

అయితే.. కింగ్ (జివి ప్రకాష్ కుమార్) స్మగ్లింగ్ చేస్తూ ఆ డబ్బుతో స్నేహితులతో కలిసి మజా చేస్తూ ఉంటాడు. కానీ వాళ్లు స్మగ్లింగ్ చేస్తుంది నీటి జలగలు కావని డ్రగ్స్ అని ఓ పెయిన్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ ద్వారా తెలుసుకుంటాడు. ఇదంతా చేస్తుంది ఎవరు? అసలు తోవత్తూర్ ప్రజలు సముద్రంలోకి ఎందుకు వెళ్లలేరు? ఈ శాపాన్ని కింగ్ ఎలా జయించాడు? అనేది “కింగ్స్టన్” (Kingston) కథాంశం.

నటీనటుల పనితీరు: ఓ రఫ్ & టఫ్ జాలరి కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడిగా జివి ప్రకాష్ కుమార్ బాగానే నటించాడు. అతడి పాత్రలో మంచి వేరియేషన్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ & ప్రీ క్లైమాక్స్ లో మంచి నట చాతుర్యం ప్రదర్శించాడు. దివ్య భారతి కనిపించేది కొన్ని సీన్స్ అయినప్పటికీ.. సినిమాకి చిన్నపాటి గ్లామర్ ను జోడించింది.

ఇటీవలే “విడుదల” (Vidudala Part 2) చిత్రంతో ఆకట్టుకున్న చేతన్ (Chetan) మరోసారి మంచి డెప్త్ ఉన్న రోల్లో డిఫరెంట్ స్క్రీన్ ప్రెజన్స్ తో అలరించాడు. అళగం పెరుమాళ్( N. Azhagam Perumal ) కి మంచి క్యారెక్టర్ పడింది. సపోర్టింగ్ రోల్ కి మించిన మంచి పాత్రలో ఆకట్టుకున్నాడు. ఫ్రెండ్ క్యారెక్టర్స్ తో పండించిన కామెడీ ఓ మోస్తరుగా వర్కవుట్ అయ్యింది. విలన్ గా నటించినవాళ్లందరూ పర్వాలేదనిపించుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: ముందుగా ప్రోస్థేటిక్ మేకప్ టీమ్ ను మెచ్చుకోవాలి. లేడీ జాంబీస్ కానీ “పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్” నుంచి ఇన్స్పైర్ అయిన స్కెలిటన్ మాన్స్టర్ గెటప్ కానీ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. అలాగే.. సీజీ వర్క్ విషయంలోనూ బృందం చాలా కేర్ తీసుకుంది. సముద్రం నిండా కళేబరాలు కనిపించే సీన్స్ కానీ, అలల సీక్వెన్స్ కానీ క్వాలిటీ విషయంలో ఆశ్చర్యపరుస్తాయి.

ఈ విషయంలో మాత్రం దర్శకుడు కమల్ ప్రకాష్ ను (Kamal Prakash) మెచ్చుకోవాలి. మరీ ముఖ్యంగా ఫాంటసీ వరల్డ్ క్రియేట్ చేయడంలో 100% విజయం సాధించాడు. అయితే.. ఆ ప్రపంచంలో పండించే డ్రామా మాత్రం ఎందుకో పూర్తిస్థాయిలో వర్కవుట్ అవ్వలేదు. అయితే.. సినిమా కోర్ పాయింట్ మాత్రం ఆసక్తికరంగా ఉంది. అత్యాశ దుఃఖానికి చేటు అనే నీతి కథను ఫాంటసీ థీమ్ తో చెప్పాలనుకున్న ప్రయత్నాన్ని మాత్రం మెచ్చుకోవాలి. అయితే.. కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే కచ్చితంగా సూపర్ హిట్ అవ్వడమే కాక సౌత్ లో సెన్సేషనల్ సినిమాగా నిలిచేది. ఓవరాల్ గా దర్శకుడు కమల్ ప్రకాష్ పర్వాలేదనిపించుకున్నాడు.

జివి ప్రకాష్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు కూడా కావడం గమనార్హం. అయితే.. తెలుగు వెర్షన్ పాటలు మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. నేపథ్య సంగీతం కాస్త కొత్తగా ఉంది. డబ్బింగ్ వెర్షన్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. తెలుగు డైలాగ్స్ చాలా చోట్ల ఎబ్బెట్టుగా ఉండడమే కాక ఓ 15 ఏళ్ల క్రితం హాలీవుడ్ డబ్బింగ్ సినిమాల క్వాలిటీని గుర్తుచేశాయి. ఇక పాటల సాహిత్యం అయితే కనీస స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. జివి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి నిర్మాత కూడా కావడం అనేది విశేషం. కథ యొక్క అవసరాన్ని అర్థం చేసుకొని మంచి బడ్జెట్ పెట్టాడు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు అనే విషయం చాలా ఫ్రేమ్స్ లో కనిపిస్తుంది.

విశ్లేషణ: చివర్లో “తుంబాడ్” సినిమాని తలపిస్తుంది “కింగ్స్టన్” (Kingston). స్క్రీన్ ప్లే & బ్యాక్ స్టోరీ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే కచ్ఛిత్మగా పెద్ద హిట్ అయ్యేది. అయితే.. ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడానికి మంచి స్కోప్ ఉన్న కథ. ముఖ్యంగా సెకండాఫ్ లో కథలోని ట్విస్ట్ ను రివీల్ చేసిన విధానం కచ్చితంగా ఆకట్టుకుంటుంది. సో, ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం “కింగ్స్టన్”ను చూడొచ్చు!

ఫోకస్ పాయింట్: తక్కువ బడ్జెట్ తో తీసిన తమిళ తుంబాడ్ ఇది!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus