సినిమా ఓ మనిషి అనుకుంటే అందులో హీరోను ఫేస్ అని చెప్పొచ్చు. ఆ ముఖం చూసే ప్రేక్షకులు టికెట్లు కొని థియేటర్లకు వస్తారు. సబ్‌స్క్రిప్షన్లు తీసుకొని ఓటీటీల్లో చూస్తారు. ఒకవేళ ఆ సినిమా హీరోయిన్ ఓరియెంటెండ్ అయితే హీరోయినే ఫేస్ అవుతుంది. అలాంటి ఫేస్ లేకుండా ఏదైనా సినిమా ప్రచారం జరుగుతుందా? సాధ్యమేనా అంటే కష్టమే అని చెప్పాలి. అయితే వివిధ కారణాల వల్ల కొంతమంది హీరోయిన్లు సినిమా ప్రచారానికి బయటకు రావడం లేదు. ఇప్పుడు ఈ కోవలోకి ప్రముఖ కథానాయిక అనుష్క కూడా వచ్చి చేరింది.
ఇప్పుడు రాబోతున్న సినిమాకు మాత్రమేనా? లేక ఇకపై ఎప్పుడూనా అనేది తెలియదు కానీ.. ‘ఘాటి’ సినిమా ప్రచారానికి అనుష్క రావడం లేదు అని మాత్రం నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చేసింది. ఆమె ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం ‘ఘాటీ’. సెప్టెంబర్ 5న ‘ఘాటి’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ప్రచారంలో నిర్మాత రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ అనుష్క విషయం చెప్పుకొచ్చారు. సినిమా ప్రారంభించినప్పుడే ప్రమోషన్స్ విషయంలో అనుష్క తన నిర్ణయం చెప్పేశారని తెలిపారాయన.
సినిమా ప్రచారానికి రాకూడదు అని ఆమె నిర్ణయించుకున్నారు.. అందుకే ఆమె ఇప్పుడు సినిమా ప్రమోషన్స్‌లో కనిపించడం లేదని తెలిపారు. అంతేకాదు ప్రీ రిలీజ్ వేడుకకు కూడా ఆమె హాజరుకాకపోవచ్చు అని తెలిపారు. అనుష్క షీలా పాత్రలో జీవించింది. ప్రేక్షకులను థియేటర్లకు తీసుకువచ్చే సామర్థ్యం అనుష్కకు ఉంది అని చెప్పారు. ఈ క్రమంలో ఒడిశాలోని ఓ ప్రాంతంలో షూటింగ్ జరిగిన రోజును గుర్తు చేసుకున్నారు. ఒక చిన్న పల్లెటూరిలో చేస్తున్నప్పుడే తెల్లవారుజామున అనుష్కను చూడడానికి 1000 మంది వచ్చారు. ఒకసారి లాఠీఛార్జి కూడా జరిగిందని గుర్తు చేసుకున్నారు.
ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. ఆంధ్రప్రదేశ్- ఒడిశా సరిహద్దులో జరిగే కథ ఇది. గంజాయి స్మగ్లింగ్ చేసే ఘాటీలుగా అనుష్క, విక్రమ్ ప్రభు కనిపిస్తారు. తాము చేస్తున్న పని తప్పని తెలుసుకుని ఆ పని నుండి బయటకొస్తారు. ఆ తర్వాత గంజాయి ముఠాను నడిపించే వ్యవస్థపై తిరుగుబాటు చేస్తారు. ఆ తర్వాత ఏమైందనేదే సినిమా.