పెడ్రో పాస్కల్, డెంజల్ వాషింగ్టన్, కొన్ని నియల్సెన్ (Cast)
రిడ్లీ స్కాట్ (Director)
రిడ్లీ స్కాట్ - మైఖేల్ ప్రూస్ - డగ్లస్ విక్ - లూసీ ఫిషర్ - వాల్టర్ ఎఫ్.పార్క్స్ - లారీ మెక్ డోనాల్డ్ - డేవిడ్ ఫ్రాన్స్జోని (Producer)
హ్యారీ గ్రెగ్సన్ - విలియమ్స్ (Music)
జాన్ మతీసన్ (Cinematography)
Release Date : నవంబర్ 14, 2024
సరిగ్గా 24 ఏళ్ల క్రితం అంటే 2000 సంవత్సరంలో విడుదలైన “గ్లాడియేటర్” ఓ సంచలనం. కథ పరంగా, కథనం పరంగా, మరీ ముఖ్యంగా టెక్నికాలిటీస్ పరంగా ఆ క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడు ఆ చిత్ర రాజానికి సీక్వెల్ గా వచ్చిన సినిమా “గ్లాడియేటర్ 2”. మరి ఈ సీక్వెల్ మొదటి భాగం స్థాయిలో ఉందా? అదే విధంగా ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగిందా? అనేది చూద్దాం..!!
Gladiator 2 Review
కథ: పోరాట భూమిలో మరణించిన గ్రేట్ గ్లాడియేటర్ మాక్సిమస్ (రస్సెల్) చిన్న కొడుకు లుసిల్లా (పాల్ మెస్కాల్) యుద్ధ ఖైదీగా రోమ్ నగరానికి తీసుకురాబడతాడు. అతడి యుద్ధ రీతి చూసినవాళ్లందరూ అవాక్కవుతారు.
అయితే.. మార్కినస్ (డెంజల్ వాషింగ్టన్) తన రాజకీయ ఎదుగుదల కోసం లుసిల్లాను వాడుకొని రోమ్ పరిపాలనలో అంతర్యుద్ధానికి తెర లేపుతాడు. మార్కినస్ రాజనీతిని.. లుసిల్లా తన యుద్ధనీతితో ఎలా గెలిచాడు? అందుకోసం ఏం కోల్పోవాల్సి వచ్చింది? అనేది “గ్లాడియేటర్ 2” కథాంశం.
నటీనటుల పనితీరు: సినిమాలో లెక్కకుమిక్కిలి ఆర్టిస్టుల్లా.. అందరికంటే ఎక్కువగా అలరించింది మాత్రం డెంజల్ వాషింగ్టన్. ఇప్పటివరకు హీరోగా మాత్రమే చూసిన అతడ్ని, నెగిటివ్ రోల్లో చూడడం చాలా కొత్తగా ఉంది. అతడి క్యారెక్టర్ ఆర్క్ కూడా భలే గమ్మత్తుగా ఉంటుంది.
కొత్తతరం గ్లాడియేటర్ గా పాల్ మెస్కాల్ ఒదిగిపోయినప్పటికీ.. ఆ పాత్ర గొప్పతనానికి న్యాయం చేయలేకపోయాడు అనిపిస్తుంది. కోనీ నెల్సన్ మాత్రం తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. పిచ్చి మహారాజుల్లా జోసెప్ క్విన్, ఫ్రెడ్ హచ్చింగర్ ఆకట్టుకోగా, “ఫౌదా” సిరీస్ ఫేమ్ లియోర్ రాజ్, పెడ్రో పాస్కల్ తదితరులు పోషించిన పాత్రలకు గౌరవం తీసుకొచ్చారు.
సాంకేతికవర్గం పనితీరు: “గ్లాడియేటర్” ఓ విజువల్ వండర్, సీక్వెల్ తో కూడా అదే మ్యాజిక్ క్రియేట్ చేయాలనే ధ్యేయంతో మొదటి సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా బాధ్యత నిర్వర్తించిన జాన్ మతీసన్ తోనే ఈ సీక్వెల్ కి కూడా సినిమాటోగ్రఫీ చేయించడం వల్ల క్వాలిటీ పరంగా అదే స్థాయి అవుట్ పుట్ వచ్చింది. సినిమాటోగ్రఫీ & సీజీ వర్క్ మంచి సింక్ లో ఉండడంతో వెతికిపట్టుకుందామన్నా విజువల్స్ పరంగా ఒక్క లోటు కనిపించలేదు. రోమ్ నగరాన్ని రీక్రియేట్ చేసిన విధానం, సెట్ వర్క్ & ఆర్ట్ వర్క్ వంటివన్నీ అద్భుతంగా ఉన్నాయి. టెక్నికల్ గా వేలెత్తిచూపే అంశం ఒక్కటే లేదు.
దర్శకుడు రిడ్లీ స్కాట్ తనదైన శైలి నైపుణ్యంతో “గ్లాడియేటర్ 2”ను కథ-కథనాల కంటే మిన్నగా ఎమోషన్ తో ఎక్కువగా నడపడానికి ప్రయత్నించాడు. అసలు గ్లాడియేటర్ ఎవరు అనే విషయం రివీల్ అయ్యేవరకు పర్వాలేదు కానీ, రివీల్ అయ్యాక సదరు డ్రామా బోర్ కొట్టింది. పీరియాడిక్ సినిమాల్లో ప్రతిక్షణం ఫైట్ సీక్వెన్స్ ల కంటే డ్రామాతో ఎక్కువగా హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఆ విషయంలో రిడ్లీ స్కాట్ ఆకట్టుకోలేకపోయాడు.
అయితే.. ఆడియన్స్ ను ఆకట్టుకునే రైనో ఫైట్ సీక్వెన్స్ ను కంపోజ్ చేసిన విధానం బాగుంది. అలాగే.. షాట్ కంపోజిషన్ పరంగా అలరించే అంశాలు చాలా ఉన్నప్పటికీ.. ప్రేక్షకుడిని థియేటర్లో కూర్చోబెట్టే అంశాలు మాత్రం పెద్దగా లేకుండాపోయాయి. అందువల్ల.. దర్శకుడిగా అలరించిన రిడ్లీ స్కాట్, కథకుడిగా ఆకట్టుకోలేకపోయాడు. అందుకే.. హాలీవుడ్ ప్రీమియర్స్ నుంచి 2000 సంవత్సరంలో విడుదలైన “గ్లాడియేటర్” కంటే తక్కువ రేటింగ్స్ & రెస్పాన్స్ వచ్చింది. దాదాపుగా 17 బిలియన్ కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం ఏమేరకు సదరు బడ్జెట్ ను రిటర్న్ తీసుకొస్తుంది అనేది బిలియన్ డాలర్ ప్రశ్న.
విశ్లేషణ: అన్నిసార్లు విజువల్ బ్యూటీ వర్కవుట్ అవ్వదు. విజువల్ కి మించిన ఎమోషన్ ఉండాలి. అప్పుడే ఆ విజువల్స్ ను బాగా ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. లేదంటే మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. “గ్లాడియేటర్ 2” విషయంలో కూడా అదే జరిగింది. భారీ క్యాస్టింగ్, అత్యద్భుతమైన విజువల్స్, గ్రాఫిక్స్ ఉన్నప్పటికీ.. సరైన ఎమోషన్ పండకపోవడంతో ఓ రెగ్యులర్ డ్రామాగా మిగిలిపోయింది ఈ చిత్రం.
ఫోకస్ పాయింట్: విజువల్ బ్యూటీకి బాగున్నా.. ఎలివేట్ చేసే ఎమోషన్ మిస్ అయ్యింది!