క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ చేసి.. హీరోగా నిలదొక్కుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్న సత్యదేవ్ టైటిల్ పాత్ర పోషించిన తాజా చిత్రం “గాడ్సే”. గోపీ గణేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ లో కంటెంట్ కంటే డైలాగుల్లోని ప్రాసలే ప్రేక్షకుల్ని ఎక్కువగా అలరించాయి. మరి సినిమా ఏ స్థాయిలో ఉందో చూద్దాం..!!
కథ: సిటీలోని ప్రముఖ బిజినెస్ మ్యాన్స్ & పొలిటీషియన్స్ మిస్ అవుతుంటారు. గాడ్సే (సత్యదేవ్) వీళ్ళందరినీ కిడ్నాప్ చేసి.. పోలీసులతో చర్చలకు దిగుతాడు. వాళ్ళని విడిచిపెట్టాలంటే.. ఇవన్నీ చేయాలంటూ పెద్ద లిస్ట్ రిలీజ్ చేస్తాడు. అసలు గాడ్సే ఎవరు? ఎందుకని వాళ్లందరినీ కిడ్నాప్ చేశాడు? అతని టార్గెట్ ఏమిటి? అనేది “గాడ్సే” కథాంశం.
నటీనటుల పనితీరు: ఎప్పట్లానే సత్యదేవ్ తన బెస్ట్ ఇచ్చాడు. క్యారెక్టర్ కి ఎలాంటి డెప్త్ లేకపోయినా.. తనదైన శైలి స్క్రీన్ ప్రెజన్స్ & డైలాగ్ డెలివరీతో “గాడ్సే” పాత్రకు న్యాయం చేశాడు. ఐశ్వర్య లక్ష్మి పాత్రకు మంచి వెయిటేజ్ ఉంది కానీ.. బ్రహ్మాజీ, తనికెళ్లభరణి, నాగబాబు, ప్రియదర్శి, చైతన్యకృష్ణ వంటి వాళ్ళందరూ తమ తమ పాత్రల్లో పర్వాలేదనిపించుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు గోపీగణేష్ ఎంచుకున్న పాయింట్ మంచిదే అయినప్పటికీ.. కథనం విషయంలో మాత్రం కనీస స్థాయి జాగ్రత్తలు తీసుకోలేదు. సెకండాఫ్ మొత్తం శివాజీ, ప్రతినిధి వంటి సినిమాలు గుర్తొస్తాయి. అలాగే.. లాజిక్స్ మాత్రం ఎంత వెతికినా దొరకవు. అసలు గాడ్సే క్యారెక్టర్ కు ఇచ్చిన ఫ్లాష్ బ్యాక్ కానీ.. అంత ఈజీగా కిడ్నాప్ లు ఎలా చేస్తున్నాడు? అనే వాటికి సమాధానాలు మాత్రం చెప్పలేదు.
సునీల్ కశ్యప్ సంగీతం, సురేశ్ సారంగం సినిమాటోగ్రఫీ సోసోగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ సినిమాకి పెద్ద మైనస్. అలాగే వి.ఎఫ్.ఎక్స్ వర్క్ చాలా పేలవంగా ఉంది. ఐడియాకు ఎగ్జిక్యూషన్ అనేది చాలా ముఖ్యం.. ఆ విషయంలో దర్శకుడు గోపీగణేష్ విఫలమయ్యాడు. డైలాగ్స్ విషయంలో మాత్రం ప్రాసలతో ప్రేక్షకుల్ని చిరాకుపెట్టించాడు.
విశ్లేషణ: సత్యదేవ్ కెరీర్ కు హీరోగా ఎలాంటి వేల్యూ యాడ్ చేయలేకపోయిన మరో చిత్రంగా “గాడ్సే” నిలిచిపోతుంది. ఈ తరహా సినిమాలు చేసేప్పుడు స్క్రీన్ ప్లే అనేది చాలా పకడ్భంధీగా రాసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది అనేందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ “గాడ్సే”.
రేటింగ్: 2/5