‘మా’ను కలిసిన గిల్డ్‌ కమిటీ.. ఏం మాట్లాడారంటే?

  • August 3, 2022 / 07:01 PM IST

తెలుగు చలనచిత్ర పరిశ్రమ కష్టాలను ఎదుర్కోవడానికి నిర్మాతలంతా కలసి బంద్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి రోజు అంతంతమాత్రంగా సాగిన బంద్‌ ఇప్పుడు ఊపందుకుంది. నిర్మాతలు సమస్యలపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో యాక్టివ్‌ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌, మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) సభ్యులు బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య కీలక అంశాలపై చర్చ జరిగిందని సమాచారం.

సినిమా చిత్రీకరణల్లో వృథా ఖర్చుల నియంత్రణ, సినిమాల్లో లోకల్‌ టాలెంట్‌ను ఎక్కువగా వినియోగించుకోవటం, ఇతర చిత్ర పరిశ్రమల నటులకు మెంబర్‌ షిప్‌ ఇవ్వడం, నటుల రెమ్యూనరేషన్‌ తదితర కీలక అంశాలపై చర్చ సాగినట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో తుది నిర్ణయం కోసం మరోసారి గిల్డ్‌, మా సభ్యులు సమావేశం అవుతారట. ఇక ఈ మీటింగ్‌లో ‘మా’ తరఫున అధ్యక్షుడు మంచు విష్ణుతోపాటు అతని ప్యానల్‌ రఘుబాబు, శివబాలాజీ తదితరులు హాజరయ్యారు. ఇక ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ నుంచి దిల్‌ రాజు, శరత్‌ మరార్‌, బాపినీడు, జీవితా రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

మంగళవారం జరిగిన సమావేశంలోనూ కొన్ని విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారని భోగట్టా. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కలసి చర్చించాయి. చలన చిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, డిజిటల్‌ ప్రొవైడర్ల మధ్య చర్చలు నడిచాయి. నిర్మాణ వ్యయం అదుపునకు ఏమేం చర్యలు తీసుకోవాలో చర్చించారు.

నిర్మాణ వ్యయంపై ఇక నుండి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు తెలిసింది. తారల పారితోషికాల భారం ఒకవైపు, వాళ్ల సహాయకులు, వాళ్ల ప్రయాణాలు, బస, ఇతరత్రా ఖర్చులు ఇబ్బంది పెడుతున్నాయని చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్ని రోజుల్లో సినిమాని పూర్తి చేయాలనే విషయంపై నిర్మాతలకి పక్కాగా స్పష్టత ఉండాలని అనుకున్నారట. ఆ లెక్కన దర్శకులు, నటులతో ముందుగానే పక్కాగా అనుకోవాలని నిర్ణయించారట.

ఓటీటీలో సినిమా తొందరగా వచ్చేస్తుందనే సంకేతాలు ప్రేక్షకుల్లోకి వెళ్లకుండా థియేటర్లలోనే ఎక్కువ రోజులు సినిమా ఉంటుందనే భావన ప్రేక్షకుల్లో కలగాలని అనుకున్నారట. ఓటీటీ వేదికల్లో 8 వారాల తర్వాతే ప్రదర్శనకు ఉంచేలా ఒప్పందం చేసుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చారట. టికెట్‌ ధరల విషయంలోనూ ఎక్కువ రేటు ఉండకుండా చూసుకోవాలని అనుకున్నారట. అందుబాటులో ధరలో టికెట్‌ ధరలు పెట్టాలని నిర్ణయించారట.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus