గుంజన్‌ సక్సెనా: ది కార్గిల్‌ గర్ల్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

  • August 12, 2020 / 06:41 PM IST

భారత వైమానిక దళంలో స్థానం సంపాదించుకున్న మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించిన గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం “గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్”. శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ టైటిల్ పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు (ఆగస్టు 12) నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. మరి ఇన్స్పైరింగ్ డ్రామా ఎలా ఉందొ చూద్దాం..!!

కథ: గుంజన్ సక్సేనా (జాన్వి కపూర్) డాటర్ ఆఫ్ అనూప్ సక్సేనా (పంకజ్ త్రిపాఠి). చిన్నప్పటి నుంచి పైలట్ అవ్వాలనేది ఆమె కల. పదో తరగతి పాసైనప్పటినుంచి పైలట్ అవ్వడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. డిప్లొమా పూర్తిచేశాక పైలట్ కోర్స్ జాయిన్ అవ్వడానికి ఏకంగా 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలుసుకొని ప్రయత్నం విరమించుకొంటుంది…

సరిగ్గా అదే సమయంలో భారత వైమానిక దళంలో మహిళలను తొలిసారిగా ఎంపిక చేసుకొంటున్నట్లు ప్రకటన రావడంతో ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నాలు మొదలెడుతుంది. క్వాలిఫైయింగ్ రిటెన్ టెస్ట్, ఫిట్ నెస్, చాకచక్య ప్రదర్శనలో పాసైనప్పటికీ.. మెడికల్ గా ఫెయిల్ అవుతుంది. అనంతరం తండ్రి స్పూర్తితో ఫిట్ నెస్ టెస్ట్ కూడా పాసై ఎట్టకేలకు స్థానం సంపాదించుకుంటుంది…

అయితే.. ఐ.ఏ.ఎఫ్ లో జాయినయ్యాక అసలు కష్టాలు మొదలవుతాయి గుంజన్ కు. మొట్టమొదటి మహిళ కావడంతో అక్కడి సోల్జర్స్ ఆమెతో ఎలా మెలగాలో తెలియక, ఆమె ఎక్కడ ఉన్నత స్థాయికి చేరుకొంటుందో అని టెన్షన్ పది ఆమె ఎదుగుదలకు అడ్డుగా మారుతారు…

ఈ వివక్షను దాటుకొని ఉత్తమ ఐ.ఏ.ఎఫ్ ఆఫీసర్ గా గుంజన్ సక్సేనా ఎలా నిలిచింది? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: తన మునుపటి రెండు సినిమాల్లో నట ప్రదర్శనతో పోల్చి చూస్తే జాన్వికపూర్ “గుంజన్ సక్సేనా”లో చాల ఇంప్రూవ్ అయ్యిందని చెప్పొచ్చు. కాకపొతే.. సినిమా మొత్తం అమ్మాయి ఒకేలా నటించింది. గుంజన్ సక్సేనా డిఫరెంట్ ఫేస్ లను ఆన్ స్క్రీన్ లో ప్రెజంట్ చేయలేకపోయింది. అందువల్ల సినిమా మొత్తం ఆమె హావభావాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో ధీరత్వాన్ని మాత్రం కనీస స్థాయిలో ప్రదర్శించలేకపోయింది జాన్వికపూర్. ఆమె నటిగా ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం చాలా ఉందని ఈ సన్నివేశాలు చూస్తే అర్ధమవుతుంది.

తండ్రి పాత్రలో పంకజ్ త్రిపాఠి మాత్రం అదరగొట్టేసాడు. కూతుర్ని ఎంకరేజ్ చేసే సీన్స్, ఆమె విజయాన్ని చూసి మురిసిపోయే సన్నివేశాల్లో పంకజ్ హావభావాలు హృదయాన్ని హత్తుకుంటాయి. సినిమాలో నటీనటులందరూ ఒకెత్తు.. పంకజ్ త్రిపాఠి ఒకెత్తు.

అంగద్ బేడీకి లభించిన స్క్రీన్ స్పేస్ చిన్నదే అయినా ఉన్నంతలో ప్రతిభ కనబరిచాడు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు శరన్ శర్మ ఎంచుకున్న కథలో ఉన్న ఉత్సుకత, కథనంలో కొరవడింది. 112 నిమిషాల్లో సినిమాని ఎందుకు ముగించాల్సి వచ్చింది అనేది దర్శకుడికే తెలియాలి. భారతదేశపు మొట్టమొదటి మహిళా ఐ.ఏ.ఎఫ్ ఆఫీసర్ గురించి సినిమా తీస్తున్నప్పుడు ఇంకాస్త ఎమోషన్ ను కోరుకొంటారు ప్రేక్షకులు. ఆమె జీవితాన్ని పూర్తిస్థాయిలో ఎక్స్ ప్లోర్ చేయలేదు దర్శకుడు. కార్గిల్ వార్ సన్నివేశాలను చూపించడానికి స్కోప్ ఉన్నప్పటికీ.. ఒకే ఒక్క సీక్వెన్స్ తో కథ ముగించేశాడు.

దాంతో కేవలం హైలైట్ చాఫ్టర్స్ ను మాత్రమే ప్రేక్షకులకు చూపించాడు. కానీ.. బయోపిక్ అంటేనే జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించడం. కరెక్ట్ గా చెప్పాలంటే ఒక బయోపిక్ అనేది ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగే వన్ డే మ్యాచ్ చూస్తున్నంత ఉద్విగ్నంగా ఉండాలి కానీ.. మ్యాచ్ హైలైట్స్ చూస్తున్నట్లు చప్పగా కాదు. ఈ విషయాన్ని దర్శకులు, రచయితలు గమనించాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే గొప్ప కంటెంట్ ఉన్న కథలు కూడా కమర్షియల్ హంగుల హోరులో కొట్టుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ బాగున్నాయి. రచయితల బృందం సన్నివేశాల మీద ఇంకొన్నాళ్ళు వర్క్ చేసి ఉంటే బాగుండేది. చాలా సింపుల్ గా సినిమా అయిపొయింది అనిపిస్తుంది. గుంజన్ సక్సేనా విజయపరంపర కంటే ఆమె ఆ విజయాలను అందుకోవడం కోసం చేసిన కృషే ఎక్కువ. దాన్ని తెరపై హైలైట్ చేయడంలో లేదా ఎలివేట్ చేయడంలో విఫలమయ్యారు దర్శకరచయితలు.

విశ్లేషణ: ఒక అద్భుతమైన జీవితం, స్ఫూర్తి నింపగల కథ ప్రొడక్షన్ లిమిటేషన్స్ వల్ల ఓ సాధారణ సినిమాగా మిగిలిపోయింది. దంగల్ స్థాయి ఉన్న గుంజన్ సక్సేనా.. ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. అలాగని బోర్ కొట్టే సినిమా కూడా కాదు. ఇంటిల్లిపాదీ చక్కగా చూడదగ్గ చిత్రం. కాకపొతే.. జాన్వికపూర్ కాకుండా ఆలియా లాంటి నటి చేసి ఉంటే సినిమా మరోలా ఉండేది.

రేటింగ్: 2.5/5

ప్లాట్ ఫార్మ్: నెట్ ఫ్లిక్స్

Click Here To Read in ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus