విక్టరీ వెంకటేష్ సోలో హీరోగా హిట్ కొట్టి చాలా కాలమైపోయింది. “దృశ్యం” హిట్ అయినా ఆ క్రెడిట్ మొత్తం కథకే చెందడంతో ఒక నటుడిగా వెంకీ మంచి హిట్ సాధించి ఏళ్ళు గడుస్తోంది. అందుకే తనకు బాగా అచ్చోచ్చిన రీమేక్ రహదారిని ఎంచుకొని తమిళ/హిందీ భాషల్లో సక్సెస్ సాధించిన “సాలా ఖడూస్” చిత్రాన్ని తెలుగులో “గురు”గా రీమేక్ చేయించుకొని మరీ టైటిల్ పాత్ర పోషించాడు. మరీ వెంకీకి రీమేక్ ఫార్ములా అచ్చోచ్చి హిట్ అందుకోగలిగాడా, లేదా? అనేది తెలియాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే..!
కథ : ఆదిత్య (వెంకటేష్) ప్రపంచస్థాయి బాక్సింగ్ ప్లేయర్, కానీ స్పోర్ట్స్ సెలక్షన్ కమిటీలో జరిగిన రాజకీయాల కారణంగా పోటీలకు వెళ్లలేక కోచ్ గా సెటిల్ అయిపోతాడు. కారణాంతరాల వలన వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన ఆదికి అక్కడి స్పోర్ట్స్ అకాడమీ కోచింగ్ తీసుకొంటున్న విద్యార్ధుల కంటే.. రోజు కూలీ అయిన రామేశ్వరి అలియాస్ రాముడు (రీతికా సింగ్) బాక్సింగ్ పట్ల ఆసక్తి చూపడంతోపాటు అందరికంటే మెరుగ్గా ఉండడాన్ని గమనించి ఆమెకు ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభిస్తాడు. మొదట్లో ఏదో దుర్భుద్దితోనే ఆదిత్య ఇదంతా చేస్తున్నాడని భావించిన రామేశ్వరి అతడికి సహకరించక కావాలనే ఓడిపోతుంది. కానీ.. తర్వాత నిజం తెలుసుకొని సీరియస్ గా ట్రైనింగ్ తీసుకోవడం మొదలెడుతుంది. రామేశ్వరిని నేషనల్ లెవల్ ప్లేయర్ గా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఆదిత్యకు మరోమారు అడ్డంకిగా నిలుస్తాడు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ దేవ్ కత్రి (జాకీర్ హుస్సేన్). ఈ ఇబ్బందులను ఆదిత్య ఎలా జయించాడు, తన ప్రియ శిష్యురాలిని ఛాంపియన్ గా ఎలా తీర్చిదిద్దాడు అనేది “గురు” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు : నిన్నమొన్నటి వరకూ వెంకటేష్ ను ఫ్యామిలీ హీరోగా చూసి అలవాటుపడిపోయిన్ ప్రేక్షకులకు కరుకు గురుడిగా ఆశ్చర్యం కలిగిస్తాడు వెంకీ. వేషధారణ మొదలుకొని హావభావాల ప్రదర్శన వరకూ ప్రతి విషయంలోనూ పరిణితి ప్రదర్శించాడు. ఒరిజినల్ లో నటించిన మాధవన్ ను బీట్ చేయలేకపోయాడనుకోండి, కానీ తనదైన శైలిలో ఎమోషన్స్ ను పండించిన తీరు మాత్రం ప్రశంసనీయం. తమిళ మాతృకకు నేషనల్ అవార్డ్ అందుకొన్న రితికా సింగ్.. “గురు” చిత్రంలో నటిగా మరింత మెచ్యూరిటీ ప్రదర్శించింది. కాకపోతే.. అమ్మడికి చెప్పించిన డబ్బింగ్ కాస్త ఇబ్బందికరంగా ఉంది. నాజర్, జాకీర్ హుస్సేన్, తనికెళ్లభరణీలు తమ సీనియారిటీతో పాత్రల్లో జీవించేశారు. తల్లి పాత్రలో అనితచౌదరి మాత్రం సహజత్వం ప్రదర్శించలేకపోయింది.
సాంకేతికవర్గం పనితీరు : సంతోష్ నారాయణ్ సంగీతం ఈ చిత్రానికి ఆయువుపట్టు. ట్యూన్స్ అన్నీ మాతృక చిత్రానివే కాగా.. నేపధ్య సంగీతంతో మాత్రం ఆకట్టుకొన్నాడు. ముఖ్యంగా బాక్సింగ్ సీన్స్ కోసం వాడిన “సింక్ సౌండ్” టెక్నాలజీ ప్రేక్షకుడ్ని సదరు బాక్సింగ్ సీన్స్ లో లీనం చేసేస్తుంది. కె.ఏ.శక్తివేల్ సినిమాటోగ్రఫీ సినిమాకి మరో ఎస్సెట్. గింబల్ క్యామ్ తో షూట్ చేసిన బాక్సింగ్ సీన్స్, క్రేన్స్ వాడకుండా తీసిన మోషన్ షాట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నటుడు/రచయిత/దర్శకుడు హర్షవర్ధన్ సమకూర్చిన సంభాషణల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కరుకుటనంతోపాటు సహజత్వం ఉట్టిపడేలా ఉన్నాయి మాటలన్నీ, ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకొంటున్నట్లే ఉన్నాయి కానీ.. ఎక్కడా అతి అనిపించదు.
తమిళ మాతృకలో దొర్లిన కొద్దిపాటి తప్పులను గుర్తించి.. తెలుగు రీమేక్ లో వాటిని సరిదిద్దడం విశేషం. నిర్మాణ విలువలూ కథకు అవసరమైనట్లుగా ఉన్నాయి. తక్కువ లొకేషన్స్ లో షూట్ చేసినా.. కథ-కథనంలోని పట్టు కారణంగా ప్రేక్షకుడు వాటిని పెద్దగా పట్టించుకోడు. దర్శకురాలు సుధ కొంగర అయిదేళ్లపాటు కష్టపడి రాసుకొన్న కథ ఇది. మంచి స్క్రీన్ ప్లే, అంతకుమించిన మంచి నటీనటులు తోడవ్వడంతో “గురు” సినిమా ఒక పారదర్శక చిత్రంగా తయారయ్యింది. భవిష్యత్ లో తెలుగులోనూ వైవిధ్యమైన చిత్రాలు రూపొందడానికి “గురు” నాంది పలికింది. ఫార్ములా ప్రకారం సినిమాని రెండున్నర గంటలు సాగదీయకుండా.. రెండు గంటల్లో కథను ముగించిన తీరు ప్రశంసనీయం. ప్రతి ఫ్రేమ్ లోనూ దర్శకురాలిగా తన మార్క్ వేసింది సుధ కొంగర.
విశ్లేషణ : హిందీలో “దంగల్” చూసి “ఆర్రే ఇలాంటి సినిమా తెలుగులోనూ వస్తే బాగుండు” అని బాధపడిన తెలుగు ప్రేక్షకుడికి దొరికిన సమాధానమే “గురు”. “దంగల్” స్థాయిలో లేకపోయినా, ఆ స్థాయి ఎమోషన్స్ ను మాత్రం క్రియేట్ చేయగలిగింది. ఒక నటుడిగా వెంకీ ట్రాన్స్ ఫార్మేషన్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సో, ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం “గురు” చిత్రాన్ని తప్పకుండా చూడవచ్చు!